అయ్యో 'పబ్‌జీ' గేమ్‌ ఎంత పనిచేసింది..

అయ్యో 'పబ్‌జీ' గేమ్‌ ఎంత పనిచేసింది..

పబ్‌జీ గేమ్‌ను యువకులు ఆడు కోవడంకాదు... ఆ గేమే ఇప్పుడు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది... పబ్‌జీ గేమ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైతే ఎంతటి దుష్పరిణామాలు ఎదురవుతాయో తెలియజెప్పే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. అదే పనిగా పబ్‌జీ గేమ్ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తిండీ, తిప్పలు లేకుండా ఆన్‌లైన్ గేమ్ ఆడటంతో కుంగి కుశించిపోయాడు. చివరికి మెదడులో రక్తస్రావం కావడంతో కదలలేని స్థితికి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తికి చెందిన 18 ఏళ్ల కేశవర్ధన్.. డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. చదువులో చురుకుగా ఉండే.. కేశవ్‌కు పబ్‌జీ కమ్మేసింది.. కొద్ది రోజులుగా పబ్‌జీకి అలవాటు పడ్డాడు. అలా దానికి బానిసయ్యాడు. ఆ ఆటే అతడి ప్రపంచమైంది. పగలు, రాత్రి అనే తేడా లేనేలేదు.. చదువు అటకెక్కించాడు.. తిండీ, తిప్పలు కూడా మానేసి పబ్‌జీలో మునిగిపోయారు.. ఇంట్లో కుటుంబసభ్యులు హెచ్చరిస్తే.. వాళ కళ్లుగప్పి రాత్రి పూట మరీ దుప్పటి కప్పుకొని పబ్‌జీ ఆడేవాడు.. అలా.. తల్లి భోజనానికి పిలిచినా ఆకలి లేదని చెప్పి గేమ్‌లో మునిగిపోయేవాడు.

ఇలా పబ్‌జీ గేమ్‌లో బందీగా మారిపోయిన కేశవర్ధన్‌ నెల రోజుల గడిచేసరికి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఇక, వారం రోజుల కిందట అతడికి జ్వరంతో పాటు వాంతులయ్యాయి. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చూపించినా ప్రయోజనం లేకపోయింది.. జ్వరం తగ్గకపోగా.. వాంతులతో డీహైడ్రేషన్‌ పెరిగిపోయింది. చివరికి మెదుడుపై తీవ్ర ఒత్తిడి పడి పరిస్థితి విషమించింది. కాలు, చేయి కదపలేని స్థితికి వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన బాధితుడి తల్లి.. గత నెల 26వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. న్యూరో ఫిజీషియన్‌ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం యువకుడిని ఐసీయూకు తరలించి అత్యవసరంగా చికిత్స అందించారు. మెదడుకు రక్త ప్రసరన చేసే నరాల్లో ఇబ్బంది రావడంతో యువకుడి ఆరోగ్య పరిస్థితి  విషయమించినట్టు గుర్తించారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి వల్ల శరీరంలో సోడియం, పోటాషియం స్థాయిలు తగ్గి అది చివరికి మెదడుపై ప్రభావం చూపినట్టు తేల్చారు. మొత్తానికి ప్రాణాపాయస్థితి నుంచి కేశవర్ధన్‌ బయటపడ్డాడు. అయితే, శక్తినంతా కోల్పోయి.. నీరశించిపోయాడు. ఆన్‌లైన్‌గేమ్‌ జోలికి వెళ్లొద్దని.. వెళ్లినా.. వాటికి బానిసలైపోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.