ఎన్నికల ఫలితం రూపంలో ప్రజలే తమ తీర్పు చెబుతారు:కోడెల

ఎన్నికల ఫలితం రూపంలో ప్రజలే తమ తీర్పు చెబుతారు:కోడెల

జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యనించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోడెల మాట్లాడుతూ రాజుపాలెం మండలం ఇనుమెట్ల పోలింగ్ స్టేషన్ లోపల ఏం జరిగిందో తెలిపే వీడియో దృశ్యాలు బయటపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇనుమెట్ల బూత్ కాప్చరింగ్ జరిగిందని సమాచారం వస్తే అక్కడికి వెళ్లిన తనపై, తన భద్రతా సిబ్బందిపై, అనుచరులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం చూడలేదన్నారు కోడెల. దాడిలో తన దృఢమైన కారు అద్దాలు కూడా పగిలిపోయాయని గుర్తు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరటం తప్పా? అని అడిగారు. తనపై దాడి జరుగుతున్నా సంయమనంతో ఉండాలని భద్రతా సిబ్బందిని ఆదేశించినట్టు వివరించారు. తనపై దాడి చేసినవారికి ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని అన్నారు.

అసలు చంద్రబాబుకు జగన్ పోటీయే కాదని కోడెల చెప్పారు. సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు తనకు పోటీ కాదని తేల్చేశారు. ఏపీలో టీడీపీకి వైసీపీ పోటీయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ వదిలి రాని జగన్ కు ఏపీలో అధికారం కావాలా? ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. టీఆర్ఎస్ అండతో ఏపీలో రాజకీయాలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాని వాళ్లకు జీతం తీసుకొనే హక్కే లేదని కోడెల కుండబద్దలు కొట్టారు. తాను స్పీకర్ గా సభానియమాల ప్రకారమే నడుచుకున్నట్టు కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగకుండా చూశానని కోడెల చెప్పారు.

ఎన్నికల సంఘం ఇంత దారుణంగా పని చేయడం 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను సర్వనాశనం చేశారని వ్యాఖ్యానించారు. మోడీ ఏం చెబితే అది చేస్తే ఇక ఎన్నికల సంఘం దేనికని అడిగారు. ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి బినామీలా వ్యవహరిస్తున్నారని.. ఆయన ఏం చెబితే ఎన్నికల సంఘం అది చేస్తుందా? అని ప్రశ్నించారు. ఈవీఎంలు మొరాయించి, పోలింగ్ అర్థరాత్రి వరకు జరిగితే పోలింగ్ బాగా జరిగిందని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.