పుల్వామా దాడి: 49కి చేరిన మృతుల సంఖ్య

పుల్వామా దాడి: 49కి చేరిన మృతుల సంఖ్య

జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల సంఖ్య 49కి చేరింది. గాయపడిన వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ ఈరోజు శ్రీనగర్ లోని బదామిభాగ్ హస్పిటల్ చనిపోయారు. ఇప్పటికే 46 మంది జ‌వాన్ల మృత‌దేహాల‌ను వాళ్ల వాళ్ల స్వంత గ్రామాల‌కు త‌ర‌లించిన‌ట్లు అధికారులు వెల్లడించారు. మ‌రో ముగ్గురి మృత‌దేహాలు మాత్రం ఇంకా ఆచూకీ చిక్కడం లేద‌ని తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన రోడ్డును ప్రస్తుతం మూసివేశారు. ట్రాఫిక్‌ను గాలెండ‌ర్ మార్గం దిశ‌గా త‌ర‌లిస్తున్నారు. ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ ద‌ర్యాప్తు బృందాలు హైవేపై ఆన‌వాళ్లు సేక‌రించ‌నున్న నేప‌థ్యంలో ఆ రూట్లో కొంత స‌మ‌యం ట్రాఫిక్‌ను నిలిపేయ‌నున్నారు. 

భారత జవాన్లపై దాడికి పాల్పడ్డ్ జైషే- మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆహ్మద్ పక్కా ప్లాన్ ప్రకారమే దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. దాడికి కొద్దిరోజుల ముందే ఆదిల్ పుల్వామాకు పదికిలోమీటర్ల దూరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం పుల్వామా ప్రాంతంలో భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కాన్వాయ్‌లో వెళ్తారని ముందుగా తెలుసుకున్న అదిల్‌.. ఓ కారును అద్దెకు తీసుకుని అందులో దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలను సిద్ధం చేసుకున్నాడు. కాన్వాయ్‌ అటుగా వస్తోందని గ్రహించి తన కారుతో వేగంగా ఢీకొన్నాడు. 49 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు.