'లైగర్' హంగామా మామూలుగా లేదుగా !

'లైగర్' హంగామా మామూలుగా లేదుగా !

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్ పాన్ ఇండియా మూవీ 'లైగర్' టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు  ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా విడుదలైందో లేదో... తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండ అభిమానులు హంగామా మొదలెట్టేశారు. వినైల్ పోస్టర్స్ ను కూడళ్ళ లో పెట్టి దానికి పాలాభిషేకం చేసిన వారు కొందరైతే, ఆ పోస్టర్ ముందు కేక్ కట్ చేసి... సంబరాలు జరుపుకున్న వాళ్ళు మరికొందరు. అంతేకాదు... సినిమా విడుదల సమయంలో థియేటర్ల దగ్గర బాణసంచా కాల్చి, డప్పులతో హంగామా సృష్టించినట్టే... 'లైగర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ముందూ కొందరు కుర్రాళ్ళు తీన్ మార్ స్టెప్పులూ వేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడే ఇంత సందడి చేస్తున్న అభిమానులు మరి రేపు రిలీజ్ టైమ్ లో ఇంకెంతగా జోరును ప్రదర్శిస్తారో చూడాలి. విశేషం ఏమంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ అభిమానులు ఈ పోస్టర్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు!