'పుష్ప' స్థానంలోకి 'ఆచార్య'... 'ట్రిపుల్ ఆర్' స్థానంలోకి 'పుష్ప'!

'పుష్ప' స్థానంలోకి 'ఆచార్య'... 'ట్రిపుల్ ఆర్' స్థానంలోకి 'పుష్ప'!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్ రీషఫెల్ అవుతున్నాయి. ఈ నెల 16న రావాల్సిన 'లవ్ స్టోరీ' వాయిదా పడటంతో మీడియం బడ్జెట్ మూవీస్ నిర్మాతలు సైతం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆ రకంగా 23న 'టక్ జగదీశ్', 30న 'విరాట పర్వం' కూడా రావడం కష్టమే అనిపిస్తోంది. ఇప్పటికే 23న రావాల్సిన పాన్ ఇండియా మూవీ 'తలైవి'ని కూడా పోస్ట్ పోన్ చేశారు.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా కూడా వాయిదా పడబోతోందట. అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని పెట్టబోతున్నారని, అలా అయితే 'ఆచార్య' లాంటి సినిమాను విడుదల చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదని నిర్మాతలు భావిస్తున్నారు. నిజానికి 'ఆచార్య' మే 13న రావాల్సింది. సో... దీనిని 'పుష్ప' విడుదల కావాల్సిన ఆగస్ట్ 13కి వాయిదా వేయొచ్చునని అంటున్నారు. అలానే మొదటి నుండి 'పుష్ప' రిలీజ్ డేట్ ను మార్చాలని భావిస్తున్న సుకుమార్ అండ్ కో... ఇప్పుడు తమ దృష్టిని దసరా సీజన్ పై పెట్టిందట. దసరా పండగ కానుకగా 'ట్రిపుల్ ఆర్' మూవీ రావాల్సి ఉంది. కానీ ఇందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కొందరికి కరోనా రావడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందని తెలుస్తోంది.

అదే జరిగితే... 'ట్రిపుల్ ఆర్' ఏకంగా వచ్చే యేడాది సంక్రాంతి సీజన్ కే రావచ్చునని అంటున్నారు. ఒకటి మాత్రం నిజం... ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు ప్రకటించిన తేదీలలో ఆ యా సినిమాలు రావడం అనేది మాత్రం జరిగే పనికాదు. కరెక్ట్ రిలీజ్ డేట్స్ తెలియాలంటే... కొంతకాలం వేచి చూడాల్సిందే!