సత్తా చాటిన సింధు....మూడో సారి ఫైనల్లోకి 

సత్తా చాటిన సింధు....మూడో సారి ఫైనల్లోకి 

 

తనకు అచ్చొచ్చిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లో సత్తా చాటింది పీవీ  సింధు. వరుసగా మూడో సారి ఫైనల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. సెమీస్‌లో ఏ మాత్రం తడబాటు లేకుండా ప్రత్యర్థిని అలవోకగా మట్టి కరిపించి ఫైనల్లోకి చేరింది సింధు. వరుసగా మూడో సారి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. సెమీస్‌లో సింధు దూకుడుకి ప్రత్యర్థి ఏ మాత్రం నిలవలేకపోయింది. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించింది సింధు. సుధీర్ఘమైన ర్యాలీలు, పదునైన స్మాష్‌ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది సింధు.  సెమీ ఫైనల్‌ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్‌ యుఫెను మట్టికరిపించింది.

తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు, రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించి గేమ్‌తో పాటు ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది. ఫైనల్‌లో చేరిన సింధు రజత పతాకాన్ని కన్‌ఫార్మ్‌ చేసుకుంది. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు నెగ్గిన చైనా ప్లేయర్‌ జాంగ్‌ నింగ్‌ పేరిట ఉన్న రికార్డ్‌ ను సమం చేసింది సింధు. ఇప్పటికే స్వర్ణం, రజతంతో పాటు రెండు కాంస్యపతకాల్ని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో కొల్లగొట్టిన సింధు, ఫైనల్లో గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఈ టోర్నిలో వరుసగా రెండు గోల్డ్‌ మెడల్స్‌ దక్కించుకున్న ప్లేయర్‌గా నిలుస్తుంది సింధు. తుది పోరులో రచనాక్‌ ఇంతానాన్‌, ఒకుహారా మధ్య జరిగే పోరులో గెలిచిన విజేతతో తలపడనుంది సింధు.