ఫోర్బ్స్‌ జాబితాలో పీవీ సింధు..

ఫోర్బ్స్‌ జాబితాలో పీవీ సింధు..

తెలుగు తేజం.. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఏస్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలతో తన ఆట, తనలోని పట్టుదలను నిరూపించుకున్న పీవీ సింధు.. సంపాదనలోనూ తాను తక్కువేం కాదని నిరూపించుకుంది. ‘ఫోర్బ్స్‌-2019 మహిళా అథ్లెట్ల’ జాబితాలో భారత్‌ నుంచి టాప్ స్పాట్‌లో నిలిచింది ఈ తెలుగుతేజం. అయితే, ఈ జాబితాలో ఓవరాల్‌గా 13వ స్థానం దక్కింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఓ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి 15 మంది మహిళా అథ్లెట్ల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌. ఈ జాబితాలో అమెరికాకు చెందిన టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ రూ. 207 కోట్లతో మహిళా అథ్లెట్లలో టాప్ స్పాట్‌లో నిలవగా... జపాన్‌ టెన్నిస్‌ స్టార్ నవోమి ఒసాకా రూ. 172 కోట్లుతో  రెండోస్థానంలో.. జర్మనీ టెన్నిస్‌ తార ఏంజెలికా కెర్బర్‌ రూ. 84 కోట్లుతో మూడోస్థానంలో నిలిచారు. 

ఈ జాబితాలో ఓవరాల్‌గా పీవీ సింధుకు 13వ స్థానం దక్కింది... భారత్‌ నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక మహిళా అథ్లెట్ ఆమె. ఈ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాలా రూ. 39 కోట్లు పారితోషికంగా అందుకుంటోందని ఫోర్బ్స్ వెల్లడించింది. సింధు ఇప్పటికీ భారత్‌లో అత్యధిక మార్కెట్‌ కలిగిన మహిళా అథ్లెట్‌. గత సీజన్‌ చివరిలో ఆమె వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిందని ఫోర్బ్స్ ప్రకటించింది. గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు సదరు అథ్లెట్ల టోర్నీ ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల ద్వారా లభించిన మొత్తం ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది ఫోర్బ్స్.