ఈవీఎంల తరలింపుపై ఎన్నో ప్రశ్నలు!!

ఈవీఎంల తరలింపుపై ఎన్నో ప్రశ్నలు!!

ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, పంజాబ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌, ప్రైవేట్ వాహనాల్లో తరలించడంపై పలు వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం నుంచి దీనికి సంబంధించిన అనేక వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. గురువారం ఓట్ల లెక్కింపునకు ముందు ఈ వీడియోలు రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్ మిషన్ల భద్రత, ట్యాంపరింగ్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వార్తలు వదంతులేనని ఈసీ స్పష్టం చేస్తున్నప్పటికీ వీడియోలు మాత్రం ఆగడం లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ లపై ఇప్పటికే విపక్షాలు పోరాటబాట పట్టాయి. ప్రజలు ఈవీఎంల ద్వారా తమ తీర్పునిస్తే బీజేపీ ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి రావాలని చూస్తోందని విపక్షాలు ఆరోపించాయి. 

ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ పార్లమెంటరీ సీట్ నుంచి సోమవారం వెలుగు చూసిన ఒక మొబైల్ ఫోన్ క్లిప్ లో ఈవీఎంలను దించి కౌంటింగ్ సెంటర్ గా భావిస్తున్న ఒక గదిలో పెడుతున్నారు. చందౌలీ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మద్దతుదారులు ఈ వీడియో తీశారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజున ఎందుకు ఓటింగ్ మిషన్లను తెస్తున్నారన్న వారి ప్రశ్నకు అధికారులు ఇవి చందౌలీలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తెచ్చిన 35 రిజర్వ్ ఈవీఎంలని జవాబు చెబుతున్నారు. ప్రయాణ ఇబ్బందుల కారణంగా మిగతా ఈవీఎంలతో పాటు చేరాల్సిన ఈ మిషన్లు ఆలస్యంగా స్టోరేజ్ గదికి, కౌంటింగ్ కేంద్రానికి వచ్చాయని చెప్పారు. నియమాల ప్రకారం రిజర్వ్ ఈవీఎంలు కూడా ఓటింగ్ కి ఉపయోగించిన మిషన్లతో పాటే డిపాజిట్ చేయాలి. 

తూర్పు యుపిలోని గాజీపూర్ లో బీఎస్పీ అభ్యర్థి గత రాత్రి ఈవీఎంలు భద్రపరిచే గది బయట ధర్నా నిర్వహించారు. ఓటింగ్ మిషన్లు నింపిన ఒక వాహనాన్ని బయటికి తీసుకెళ్లబోయారని అఫ్జల్ అన్సారీ, ఆయన మద్దతుదారులు ఆరోపించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ల చుట్టుపక్కల అభ్యర్థుల ప్రతినిధులు పరిశీలిస్తుండేందుకు ఏర్పాట్లు చేస్తామని, పూర్తి పారదర్శకతతో లెక్కింపు నిర్వహిస్తామని జిల్లా రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో ప్రదర్శనకారులు తమ నిరసన విరమించారు. జిల్లా పోలీసులు, అధికారులు ఇవి ఉత్తి ఆరోపణలని కొట్టిపారేశారు. అఫ్జల్ అన్సారీ ప్రత్యర్థిగా బీజేపీ తరఫున కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా పోటీ చేశారు. 

ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను పనికిమాలినవిగా తేల్చేసింది. ఓటింగ్ మెషీన్లను తగిన భద్రత, ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. గాజీపూర్, చందౌలీలలో ఏడు దశల ఎన్నికలలో చివరన ఆదివారం పోలింగ్ జరిగింది. గత మంగళవారం ఎస్పీ-బీఎస్పీ కార్యకర్తలు తూర్పు ఉత్తరప్రదేశ్ లోని దొమారియాగంజ్ సీట్ కి చెందిన ఒక స్టోరేజ్ గది నుంచి ఈవీఎంలు నిండిన మినీ ట్రక్ ను పట్టుకున్నారు. ఓటింగ్ మిషన్లను ట్యాంపర్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని వారు ఆరోపించారు. నిరసన ప్రదర్శనల తర్వాత ఓటింగ్ మిషన్లను తిరిగి కౌంటింగ్ సెంటర్ ఆవరణలోకి తీసుకెళ్లారు. అవి ఆరో దశ ఓటింగ్ కి ముందుకు తమకు పంపిన అదనపు ఈవీఎంలని ఏదో దశలో పోలింగ్ జరిగే జిల్లాలకు తరలిస్తున్నట్టు స్థానిక యంత్రాంగం చెప్పింది.

ఝాన్సీ, మవూ, మీర్జాపూర్, హర్యానా, పంజాబ్ లలోని కొన్ని ప్రాంతాలు, బీహార్ ల నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వీడియోలు, ఆరోపణలు సరిగ్గా ఈవీఎంలు, వీవీప్యాట్లపై తమ ఆందోళనను ఎన్నికల సంఘానికి వివరించేందుకు  కాంగ్రెస్ సహా 21 ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ముందు బయటపడ్డాయి. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత అనూహ్యంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాల్లో కూడా ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని విపక్ష నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వంద శాతం వీవీ ప్యాట్ లు లెక్కించాలని డిమాండ్ వస్తోంది. 

అయితే ఎన్నికల కమిషన్ మాత్రం సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఐదు బూత్ లలో మాత్రమే వీవీప్యాట్ స్లిప్ లు లెక్కించనున్నారు. అసలే ఈవీఎంలపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించడంతో ఈవీఎం ఫలితాల ట్యాంపరింగ్ పై మరింత అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.