నాలుగో రోజు ముగిసిన ఆట...రికార్డుకు చేరువలో అశ్విన్

నాలుగో రోజు ముగిసిన ఆట...రికార్డుకు చేరువలో అశ్విన్

విశాఖ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోయి 11 పరుగులు చేసింది. సఫారీలకు 395 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 323 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా స్వల్ప వ్యవధిలోనే తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో దుమ్మురేపిన డీన్‌ ఎల్గర్ వికెట్‌ను కోల్పోయింది. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్గర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఆట ముగిసేసరికి 9 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా 11 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ 3 రన్స్, డి బ్రుయిన్ 5 రన్స్ తో  క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో సౌతాఫ్రికాను ఆలౌట్‌ చేసి తొలి టెస్టులో గెలుపొందాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు చేసి డిక్లేర్ చేయగా, దక్షిణాఫ్రికా 431 పరుగులు చేసింది. ఇక దాదాపు పది నెలల తర్వాత టీం ఇండియాలో ఆడుతున్న స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు.

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి సఫారీలను కట్టడి చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ ఓ అరుదైన రికార్డుకు మరి అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడు వికెట్లతో అశ్విన్ ఖాతాలో 349 టెస్ట్ వికెట్లు చేరాయి. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఒక వికెట్ తీస్తే శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 350 వికెట్ల రికార్డును సమం చేసే అవకాశం ఉంది. ఒక కంటే ఎక్కువ వికెట్లు తీస్తే ప్రపంచ రికార్డు సాధించే అవకాశం ఉంది.