రఫెల్ పత్రాలు బయటపెట్టి దేశభద్రతని ప్రమాదంలోకి నెట్టారు

రఫెల్ పత్రాలు బయటపెట్టి దేశభద్రతని ప్రమాదంలోకి నెట్టారు

వివాదాస్పద రఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. బుధవారం సమర్పించిన అఫిడవిట్ లో పిటిషనర్లు తమ రివ్యూ పిటిషన్ లో యుద్ధ విమానానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టి దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారని కేంద్రం ఆరోపించింది. ఆ పత్రాలు ఇప్పుడు దేశ విరోధుల చేతుల్లోకి చేరాయని పేర్కొంది.

భారత్-ఫ్రాన్స్ ల మధ్య కుదిరిన రఫెల్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 14, 2018న తీర్పు నిచ్చింది. దీనిపై పునస్సమీక్ష కోరుతూ పిటిషన్లు వేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అత్యంత సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టి నేరాలని పాల్పడ్డారని ప్రభుత్వం చెప్పింది.

‘ఇది దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వం అంగీకారం, అనుమతి లేదా సమ్మతి లేకుండా ఈ సున్నితమైన పత్రాల ఫోటోకాపీలు తీసేందుకు కుట్ర చేసి, వాటిని రివ్యూ పిటిషన్/ఇతర దరఖాస్తులకు జోడించారు. తద్వారా అనధికారికంగా అలాంటి పత్రాల ఫోటోకాపీలు తీసి దొంగతనానికి పాల్పడ్డారు. ఇది దేశ సార్వభౌమత్వం, రక్షణ, విదేశాలతో సౌహార్ద్ర సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిందని‘ అఫిడవిట్ పేర్కొంది.

ఈ వ్యవహారంలో కేంద్రం ‘గోప్యతను పాటిస్తున్నా‘ రివ్యూ పిటిషనర్లు ‘ఒప్పందంలోని షరతులకు భంగం కలిగించే ఈ సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టి నేరానికి పాల్పడ్డారు‘ అని అఫిడవిట్ తెలిపింది. ‘దేశ భద్రత, రక్షణకు సంబంధించిన విషయంలో రహస్యంగా జరిగిన అంతర్గత చర్చలపై కొన్ని ఎంపిక చేసిన భాగాలు, అసంపూర్ణ చిత్రం ఇచ్చే విధంగా అనధికారంగా సంపాదించిన పత్రాలను పిటిషనర్లు ఉపయోగిస్తున్నారని‘ అఫిడవిట్ చెప్పింది. 

ఈ పత్రాల ఆధారంగా వార్తాకథనాలు ప్రచురించిన రెండు సంస్థలపై అధికార రహస్యాల చట్టం ఉపయోగించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గత వారం హెచ్చరించింది. రక్షణ మంత్రిత్వశాఖ నుంచి రఫెల్ ఫైటర్ డీల్ కి సంబంధించిన పత్రాలు చోరీ అయ్యాయని తెలిపింది. 

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ కె ఎం జోసెఫ్ ల త్రిసభ్య ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ ఈ విషయం చెప్పారు. మొదట ఆ ప్రచురణ సంస్థల గురించి చెప్పలేదు కానీ తర్వాత దొంగిలించిన ఆ పత్రాలు ద హిందూ, ఏఎన్ఐల దగ్గర ఉన్నాయని తెలిపారు.

నవంబర్ 2015 నాటి ఒక రక్షణ మంత్రిత్వశాఖ నోట్ ను ఉటంకిస్తూ ద హిందూ ఫిబ్రవరి 8న ఒక కథనం ప్రచురించింది. ఆ కథనంలో మంత్రిత్వశాఖ రఫెల్ డీల్ లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఫ్రెంచ్ పక్షంతో సమాంతర చర్చలు జరపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏఎన్ఐ కూడా అదే నోట్ ను అదనపు వివరాలతో విడుదల చేసింది.