ఆ పత్రాలు దొంగతనం కాలేదు

ఆ పత్రాలు దొంగతనం కాలేదు

రక్షణ మంత్రిత్వశాఖ నుంచి రఫెల్ పత్రాలు దొంగతనం కాలేదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ శుక్రవారం స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత రహస్యంగా భావించిన పత్రాల 'ఫోటోకాపీలను' పిటిషనర్లు సుప్రీంకోర్టుకి అందజేసిన తమ దరఖాస్తులో వాడారని చెప్పడం తన ఉద్దేశం అని ఆయన వివరణ ఇచ్చారు.

బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ రఫెల్ ఫైటర్ జెట్ డీల్ పత్రాలు దొంగిలించారని చెప్పడం రాజకీయ కలకలం రేపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంత సున్నితమైన వ్యవహారానికి సంబంధించిన పత్రాలు దొంగలించడం అంటే దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరపాలని డిమాండ్ చేశారు.

దీంతో నష్ట నివారణ చర్యలలో భాగంగా 'రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ఫైళ్లు దొంగిలించారని నేను సుప్రీంకోర్టులో వాదించినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని నాకు చెప్పారు. ఇది పూర్తిగా తప్పు. ఫైళ్లు దొంగతనం చేశారన్న మాట పూర్తిగా తప్పు' అని వేణుగోపాల్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

రఫెల్ డీల్ పై దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లను కొట్టేస్తూ ఇచ్చిన తన తీర్పుని తిరిగి సమీక్షించాలని కోర్టును కోరుతూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన దరఖాస్తులో అనుబంధంగా మూడు పత్రాలు జోడించారని అవి అసలు పత్రాల ఫోటోకాపీలని వేణుగోపాల్ చెప్పారు. ఏజీ ఉపయోగించిన దొంగతనం అనే పదం బహుశా బలమైనదని, దానిని తప్పించి ఉండాల్సిందని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇవే పత్రాల ఆధారంగా కథనాలు ప్రచురిస్తున్న ద హిందూ వార్తాపత్రికపై అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది.