రఫెల్ పత్రాలు ఎలా వచ్చాయో చెప్పమంటే చెప్పం

రఫెల్ పత్రాలు ఎలా వచ్చాయో చెప్పమంటే చెప్పం

తమకు రఫెల్ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే సమాచారాన్ని తాము ఎవరికి చెప్పబోమని ది హిందూ పబ్లిసింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం రఫెల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను ప్రచురించామని, వీటిని అందజేసిన రహస్య వర్గాలు ఎవరనే విషయం గురించి ది హిందూ వార్తాపత్రిక నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వబోమని ఎన్.రామ్ బుధవారం చెప్పారు.

ఒప్పందానికి సంబంధించిన వివరాలను నిలిపేయడం లేదా దాచి ఉంచినందువల్ల తాము ఆ పత్రాలను ప్రచురించినట్టు ఎన్.రామ్ తెలిపారు. ఇవాళ రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలను రక్షణ మంత్రిత్వశాఖ నుంచి దొంగిలించారని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ దొంగతనంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

‘మీరు వాటిని దొంగిలించిన పత్రాలు అనొచ్చు. కానీ మాకే ఆందోళన లేదు. మాకు ఇవి విశ్వసనీయ రహస్య వర్గాల ద్వారా అందాయి. మేము ఈ వర్గాల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఈ వర్గాలేంటనే విషయంపై మా నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం లభించదు. కానీ ఈ పత్రాలు అవేంటనే విషయాన్ని చెబుతున్నాయి. కథనాలు తమకు తాముగా మాట్లాడుతున్నాయని‘ రామ్ అన్నారు. రామ్ రఫెల్ ఒప్పందంపై వరుసగా వ్యాసాలు రాశారు. తాజాగా బుధవారం కూడా రాశారు. 

రఫెల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేసినవాళ్లు అధికార రహస్యాల చట్టం, కోర్టు ధిక్కరణ నేరం కింద నిందితులవుతారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ బుధవారం సుప్రీంకోర్ట్ ధర్మాసనం ముందు వాదించారు. ఫైటర్ జెట్ ఒప్పందాన్ని సవాల్ చేసిన పిటిషన్లు అన్నిటిని తిరస్కరించిన కోర్టు తీర్పును పునస్సమీక్షించాలని వచ్చిన పిటిషన్లను బెంచ్ విచారించింది.

‘సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ పై నేను వ్యాఖ్యానించను. కానీ మేం ప్రచురించిందంతా సాధికార పత్రాలనే. వివరాలను నిలిపేయడమో లేదా ముసుగేయడమో చేస్తుండటంతో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని ప్రచురించాం‘ అని రామ్ తెలిపారు. ‘పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంబంధిత సమాచారాన్ని, ప్రజా ప్రయోజనాన్ని ఎంతగానో ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకురావడం పత్రికారంగం విధి‘ అన్నారు.

భారత్-ఫ్రాన్స్ ల మధ్య రూ.59,000 వేల కోట్ల విలువైన రఫెల్ ఒప్పందంపై బేరసారాలు చేస్తుండగా ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర చర్చలు జరపడంపై రక్షణ మంత్రిత్వశాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఫిబ్రవరి 8న రామ్ ది హిందూలో రాశారు. రఫెల్ డీల్ కి సంబంధించిన ప్రభుత్వ పత్రాల ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.