తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను విచారించాలి

తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను విచారించాలి

అత్యున్నత న్యాయస్థానానికి రాఫెల్ డీల్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాధికారులను విచారించాలని కోరుతూ ప్రముఖ హక్కుల కార్యకర్త, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్ట్ తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో తాజాగా ఈ అర్జీలను ప్రశాంత్ భూషణ్ తో పాటు మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా దాఖలు చేశారు. ఇంతకు ముందు రాఫెల్ పై సుప్రీంకోర్టు తీర్పుని పునస్సమీక్షించాలని కోరుతూ ఈ ముగ్గురు జనవరి చివరలో రివ్యూ పిటిషన్ వేశారు.

’వండివార్చిన వివరాలను సమర్పించి కేంద్రం సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది. సీల్డ్ కవర్ లో అందజేసిన సమాచారం అవాస్తవమని తేలింది. ప్రభుత్వం అనిల్ అంబానీతో 2012లో చర్చలు జరిపినట్టు అందులో పేర్కొన్నారు. వాస్తవానికి చర్చలు మరో అంబానీ-ముకేష్ అంబానీతో జరిగాయి. 2012 చర్చలతో అనిల్ అంబానీకి ఎలాంటి సంబంధం లేదని’ ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ’ధరల బేరాలను ప్రైస్ నెగోషియేటింగ్ టీమ్ జరిపినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల బయటపడిన వివరాలు ప్రధానమంత్రి కార్యాలయమే ఈ చర్చలను జరిపినట్టు స్పష్టం చేశాయి. ఫైటర్ జెట్ ను ప్రభుత్వం అత్యంత సరసమైన ధరలకు పొందినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు బయటపడిన వివరాల ప్రకారం అది అవాస్తమని తేలిందని’ అన్నారు.

’ఈ అవాస్తవ వివరాలను అందజేసిన ప్రభుత్వాధికారి ఎవరో కనుగొని వారిని మోసం ఆరోపణల కింద విచారించాలని సుప్రీంకోర్టును కోరాము. ఈ సమాచారాన్ని అటార్నీ జనరల్ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారని’ భూషణ్ చెప్పారు. ‘ఈ డీల్ కేవలం అవినీతి కేసు మాత్రమే కాదు. ఈ నిర్ణయం భారత వైమానిక దళం వెన్ను విరిచింది. ఐఏఎఫ్ 126 ఫైటర్ ప్లేన్లతో 7,8 స్క్వాడ్రన్లు కావాలని కోరింది. ప్రభుత్వం దానిని 36కి తగ్గించింది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించడానికే ఇలా చేశారు. జాతీయ భద్రతతో ప్రభుత్వం చెలగాటమాడిందని’ ఆయన ఆరోపించారు.

కోర్టుకు సమర్పించిన సమాచారం అంతా తప్పుల తడకని చెబుతూ ‘సావరిన్ గ్యారంటీ, బ్యాంక్ హామీ షరతులను తొలగించారు. ఎస్క్రో ఖాతాను పక్కన పడేశారు. నిజాయితీ క్లాజ్ రద్దు చేశారు. ఈ వివరాలన్నిటిని తొక్కిపట్టారని’ అన్నారు. ‘ముగ్గురు నిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. వారు రాఫెల్ ఫైటర్ ప్లేన్ బెంచ్ మార్క్ ధరను ఏకపక్షంగా 5 బిలియన్ యూరోల నుంచి ఏకంగా 60% పెంచి 8 బిలియన్ యూరోలకు కొనరాదని చెప్పారు. తాము చౌకగా కొన్నామని ప్రభుత్వం తప్పుడు ఊహాల ఆధారంగా చెబుతోంది. ఇంతకు ముందు డీల్ కంటే ప్రస్తుత ఒప్పందం ఖరీదైంది. ప్రభుత్వం టెండర్ మార్గాన్ని పక్కన పెట్టింది. టెండర్ 126 ప్లేన్లకు విడుదల చేశారు, కానీ 36 రాఫెల్ జెట్లకు కాదని’ ఆయన ఆరోపించారు.