బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా రాజన్‌?

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా రాజన్‌?

ఇంగ్లండ్‌ కేంద్ర బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ పగ్గాలు ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ రాజన్‌కు దక్కనుందా? ఈ పదవి కోసం ఆరుగురు బరిలో ఉండగా... రాజన్‌ ప్రస్తుతం టాప్‌లో ఉన్నట్లు ఇంగ్లండ్‌ మీడియా రాస్తోంది. భారత రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అధినేతగా కూడా పనిచేశారు. 2005లోనే ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందని రాజన్‌ హెచ్చరించారు. ఆయన చెప్పినట్లే 2008లో అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. 325 ఏళ్ళ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా ఇప్పుడు ఫిలిప్‌ హామండ్‌ ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. ఈ ఏడాది అక్టోబర్‌కల్లా కొత్త గవర్నర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. 2020 జనవరిలో కొత్త గవర్నర్‌ పదవీ బాధ్యతలు చేపడుతారు. బ్రెగ్జిట్‌ వ్యవహారంలో ఇంగ్లండ్‌ ప్రభుత్వం అనేక తప్పటడుగులు వేసింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే దేశ ప్రధాని మే రాజీనామా చేసేశారు. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్‌ సంక్షోభం నుంచి ఇంగ్లండ్‌ను రాజన్‌ గట్టెక్కించగలరని బ్రిటన్‌ మీడియా రాస్తోంది. రాజన్‌కు పోటీ మరో భారత వ్యక్తి కూడా బరిలో ఉన్నారు. ఆమె సృష్టి వదేరా. గార్డన్‌ బ్రౌన్‌ ప్రభుత్వంలో పనిచేసిన ఈమె పేరును కూడా బ్రిటన్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే రాజన్‌కు ఉన్నంత విస్తార అనుభవం ఆమెకు లేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. భారత్‌లో వృద్ధి రేటు కొనసాగిస్తూనే వడ్డీ రేట్లు పెరగకుండా ఆపగలగడంలో రాజన్‌ విజయం సాధించారని, అలాగే మొండి బకాయిల విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించడంతో భారత ప్రభుత్వం కూడా స్పీడు పెంచాల్సి వచ్చిందని వీరు అంటున్నారు. కీలక సంక్షోభాలను అలవోకగా అధిగమించిన అపార అనుభవశాలి అయిన రాజన్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌ పదవి రావొచ్చని బ్రిటన్‌ మీడియా అంటోంది.