నాకు తగిన అవకాశం వస్తే భారత్ తిరిగి వస్తాను: రఘురామ్ రాజన్

నాకు తగిన అవకాశం వస్తే భారత్ తిరిగి వస్తాను: రఘురామ్ రాజన్

తనకు తగిన ఏదైనా అవకాశం వస్తే తను భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత ఒకవేళ ప్రతిపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆయనను ఆర్థిక మంత్రిగా నియమిస్తారన్న ఊహాగానాలపై రాజన్ తన అభిప్రాయం వెల్లడించారు.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మాజీ ఆర్థిక శాస్త్రవేత్త అయిన రాజన్ ప్రస్తుతం తాను ఉన్న చోట ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. కానీ కొత్త అవకాశాలను అందుకొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన రాజన్ కి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్ గా రెండో అవకాశం ఇవ్వలేదు. ఆయన తన కొత్త పుస్తకం 'ద థర్డ్ పిల్లర్' ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరిస్తూ 'నేను ఇప్పుడు ఉన్న చోట ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ నాకు తగిన ఏదైనా అవకాశం వస్తే మాత్రం నేను ఎప్పటికీ అక్కడ ఉండాలని కోరుకుంటానని' అన్నారు.

ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రాజన్ ను ఆయన ప్రజా సేవకు లేదా రాజకీయ పాత్ర పోషించేందుకు భారత్ కి తిరిగి వస్తారా అని మీడియా ప్రశ్నించింది. సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, టీడీపీ వంటి ప్రతిపక్షాలతో కూడిన మహాకూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తే ఆయనను ఆర్థిక మంత్రిగా నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మంగళవారం రాజన్ ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఒకరని ప్రశంసించారు. తమ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం రూపకల్పన సమయంలో రాజన్ సలహాలు తీసుకున్నట్టు రాహుల్ చెప్పారు. ఈ పథకం కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అత్యధిక నిరుపేదలైన 5 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72,000 ఆర్థిక సాయం అందించనుంది. 

అధికారంలోకి రాబోయే ఏదైనా పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తామని సంప్రదిస్తే ఆయన ఏం చేస్తారని ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా రాజన్ దీనిపై ఇప్పుడే చర్చ జరపడం తొందరపాటని వ్యాఖ్యానించారు. 'దీనిపై చర్చించడం తొందరపాటు అవుతుంది. ఇది భారతదేశానికి ఎంతో కీలకమైన ఎన్నికలని నాకనిపిస్తోంది. మన దేశానికి కొత్త సంస్కరణలు అవసరం. నాకు ఆ ఆలోచనలను ముందుకి తీసుకెళ్లడంలో ఎంతో ఆనందాన్నిస్తుందని' తెలిపారు.