మా సంసారంలో మీడియా నిప్పులు..వైసీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

మా సంసారంలో మీడియా నిప్పులు..వైసీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిసిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు, సూచనల కోసం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశానని రాజకీయాలు ఏవీ చర్చించలేదని అన్నారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించే అంశానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని తనకు సమాచారం ఇచ్చారని రాష్ట్రమే భద్రత కల్పిస్తామని చెబుతుందని ఏమి జరుగుతుందో వేచి చూడాలని అన్నారు.

తనకు, పార్టీ కి మధ్య అగాధం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తుందన్న ఆయన ఎప్పుడూ పార్టీని పల్లెత్తుమాట అనలేదని అన్నారు. అలానే మా సంసారంలో నిప్పులు పోయాలని మీడియా చూస్తుందని అన్నారు. బిజెపిలో చేరే అవకాశాలు లేవని, ఒక ఎంపిగా కేంద్ర మంత్రులను కలుస్తున్నానని అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడగొట్టాలని కొంతమంది చూస్తున్నారని, దానికి ఇంకా మూడు నెలల సమయం ఉందన్న ఆయన పార్టీకి, నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. పార్టీకి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని అది పటిష్టంగా ఉందని అన్నారు.

పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇవ్వలేదని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని ఆయన అన్నారు. "తిరుపతి భూముల విషయం, ఇసుక విషయంలో సూచనలు చేశాను, ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు అయిందంటే అక్కడ తప్పు జరుగుతోందని అర్ధం " అని అన్నారు. పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, పార్టీకి ప్రజలు దూరం కాకూడదని, పార్టీ మరో 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి ఆ సూచనలు చేశానని అన్నారు. నాపై ఎందుకు అనర్హత పేరిట ఫిర్యాదు చేశారో అర్థం కావడం లేదని అనర్హత పిటిషన్ లో కార్టూన్లు, జోకులు తప్ప ఏమి లేవని ఆయన పేర్కొన్నారు.