రాహుల్ మాటలు బాధించాయన్న డసాల్ట్ సీఈఓ

రాహుల్ మాటలు బాధించాయన్న డసాల్ట్ సీఈఓ

రఫేల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డీల్ లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రేపియర్ అనేక అంశాలను విడమరచి చెప్పారు. డసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ మధ్య కుదిరిన డీల్ లోని లోతుపాతులను ట్రేపియర్ ఏఎన్ఐ తో పంచుకున్నారు. 

రక్షణకు సంబంధించిన అనేక అంశాపై ఇండియాతో 1953 నుంచి కలిసి పనిచేస్తున్నామని, ఇలాంటి అనుభవం మాత్రం గతంలో ఎన్నడూ ఎదురుకాలేదన్నారు. నెహ్రూ తరువాత అనేక మంది ప్రధానులతో డీల్స్ కుదుర్చుకున్నాం. మా వ్యవహారాలు ప్రభుత్వాలతోనే తప్ప పార్టీలతో కాదు. వ్యూహాత్మక ఆయుధాలను భారత్ కు వ్యూహాత్మకంగానే సరఫరా చేస్తున్న విషయాన్ని గమనించాలని ట్రేపియర్ అన్నారు. అలాంటిది రాహుల్ అలాంటి కామెంట్లు చేయడం తనను బాధించిందని, సీఈఓ హోదాలో తాను అబద్ధం చెప్పడం సాధ్యం కాదని ట్రేపియర్ చెప్పారు. 

నవంబర్ 2న రాహుల్.. నష్టాల్లో ఉన్న రిలయన్స్ కంపెనీలో డసాల్ట్ ఏవియేషన్ రూ. 284 కోట్లు ఏ విధంగా పెడుతుందని ప్రశ్నించారు. అంతేకాదు.. ఆ డబ్బుతో నాగపూర్ లో భూములు కొన్నారని, అందువల్ల డసాల్ట్ సీఈఓ అబద్ధం చెబుతున్నారంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణ జరిగితే మోడీని ఎవరూ కాపాడలేరని కూడా రాహుల్ సవాల్ చేశారు. దీనిపై స్పందించిన ట్రేపియర్ రాహుల్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. 

ట్రేపియర్ మాటల్లో డీల్ ఇదీ:
డసాల్ట్ పెట్టిన డబ్బు నేరుగా రిలయన్స్ ఖాతాలోకి వెళ్లదు. జాయింట్ వెంచర్లోకి వెళ్తుంది. ఆ జాయింట్ వెంచర్లో డసాల్ట్ కూడా ఉంది. డసాల్ట్ లీడ్ రోల్ తీసుకునే ఈ ప్రాజెక్టులో నాకు తెలిసిన విజ్ఞానాన్ని, మానవ శక్తిని, వనరులను, ఇంజినీర్లను, పనివాళ్లను వినియోగిస్తున్నాను. ఇండియాలో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు ద్వారా దేశానికి ఉపయోగపడుతుందని, ఎయిర్ క్రాఫ్టును ఎలా తయారు చేయాలో రిలయన్స్ నేర్చుకొంటుందని, అందుకు వారు మొగ్గు చూపడంతోనే ఈ డీల్ కు అంగీకరించాం. ఇందులో డసాల్ట్ వాటా 49 శాతం. రిలయన్స్ వాటా 51 శాతం. ఫిఫ్టీ-ఫిఫ్టీ ప్రాతిపదికన మొత్తం రూ. 800 కోట్లు (రిలయన్స్ రూ. 400 కోట్లు, డసాల్ట్ రూ. 400 కోట్లు) పెడుతుంది. 

ఇందులో డసాల్ట్ ఆఫ్ సెట్ పద్ధతిలో ఏడేళ్లపాటు పనిచేస్తుంది. వ్యూహాత్మకమైన ఈ ఒప్పందం ప్రకారం మొదటి మూడేళ్లు ఎవరు ఎవరితో పని చేస్తున్నారో వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మేం 30 కంపెనీలతో పని చేస్తున్నాం. ఆఫ్ సెట్ డీల్ కింద పనిలో 40 శాతాన్ని రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 40లో రిలయన్స్ తో డసాల్ట్ పాత్ర 10 శాతం అయితే మిగిలిన 30 శాతం వివిధ కంపెనీలతో డసాల్ట్ చేసుకున్నది. 

ప్రైసింగ్: 
ఇప్పుడు కుదిరిన 36 విమానాల కొనుగోలు డీల్ 9 శాతం తక్కువతో కుదిరింది. అయితే 36 విమానాల ధర 18 విమానాల ధరతో సమానం. అంటే పాత ధరకే రెట్టింపు విమానాలు వస్తున్నాయి. అయినా 9 శాతం తగ్గించి ఎందుకిచ్చామంటే... ఇది భారత ప్రభుత్వానికి, ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల ఫలితం. ఈ ఒప్పందాన్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే.. 126 హెలికాప్టర్ల తో కుదిరిన డీల్ కన్నా 36 విమానాల డీల్ ఇంకా తక్కువ. అయితే మొదటి డీల్ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ముఖేశ్ అంబానీ రిలయన్స్ తో కలిసి పని చేయాల్సి వచ్చినా మాకేమీ అభ్యంతరం ఉండేది కాదు. 
126 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒప్పందంలోని అంశాల తీరుతో పాటు వాటికన్నా తమకు 36 విమానాలు చాలా తొందరగా కావాలన్న ప్రతిపాదన ఇండియా నుంచి వచ్చింది. అందువల్ల తొలుత ఆ రెండు కంపెనీలతో వర్క్ చేసేందుకే నిర్ణయించుకున్నాను. కొన్ని రోజుల క్రితం కూడా అదే విషయం చెప్పాను. అయితే ఆఫ్ సెట్ డీల్ కు వారు ఒప్పుకోలేదు. అందువల్ల డసాల్ట్, రిలయన్స్ కలిసి కొత్త ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులకు నిర్ణయించుకున్నాం. 

టాటా వంటి ఫ్యామిలీ గ్రూపులతో డీల్ కు మేం వెళ్లే వాళ్లమే. అయితే ఆ సమంయలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం డసాల్ట్ కు ఇవ్వలేదు. 2011 లో ఈ చర్చలు జరుగుతున్నప్పుడు టాటా కూడా ఇతర ఫ్లైయింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అందువల్ల పెద్ద ఇంజినీరింగ్ ఫెసిలిటీస్ ఉన్న రిలయన్స్ తో డీల్ ను ఓకే చేశాం. ఈ డీల్ లో తయారు చేసే విమానాల్లో వెపన్స్, మిస్సైల్స్ తప్ప అన్ని రకాల సదుపాయాలుంటాయి. ఒప్పందం ప్రకారం వెపన్స్ లేని యుద్ధవిమానాలనే డసాల్ట్ ఇండియాకు పంపిణీ చేస్తుంది.