రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం

రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం

భారత మాజీ కెప్టెన్, మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరచడంతో పాటు, క్రికెట్‌కు ఎనలేని సేవలు అందిస్తోన్న వారికి ఐసీసీ 'ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరిట పురస్కారాలను అందిస్తుంటోంది. తాజాగా దుబాయ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సంవత్సరం హాల్‌ ఆప్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన క్రికెటర్ల పేర్లను ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రిచ‌ర్డ్‌స‌న్ వెల్ల‌డించారు. ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ చోటు దక్కించుకున్నాడు. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, ఇంగ్లాండ్‌ మాజీ క్రీడాకారిణి క్లేరీ టేలర్‌ కూడా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్న ఐదో భార‌త ఆట‌గాడిగా రాహుల్ ద్ర‌విడ్ చోటు దక్కించుకున్నాడు. అంతకుముందు బిష‌న్ సింగ్ బేడీ, సునీల్ గ‌వాస్క‌ర్‌, కపిల్ దేవ్‌, అనిల్ కుంబ్లేలు ఈ జాబితాలో చోటుసంపాదించారు. ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ... ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఐసీసీ, బీసీసీఐకి ధన్యవాదాలు అని తెలిపారు. ప్రస్తుతం ద్రవిడ్ భారత అండర్‌-19, భారత-ఎ జట్లకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.