పింక్ బాల్ టెస్ట్.. రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

పింక్ బాల్ టెస్ట్.. రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

టెస్టులకు పునర్జీవం పోసేందుకు కొత్త ప్రయోగం చేస్తున్నారు.. పింక్ బాల్‌తో క్రికెట్ ప్రేమికులను స్టేడియాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పింక్ బాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్.. టెస్ట్‌ క్రికెట్ పునర్జీవానికి చేసే ప్రయత్నాల్లో ఇదొకటి అని పేర్కొన్న ఆయన.. భారత్‌లో టెస్టు క్రికెట్‌ బతికేందుకు కొత్త తరహా డే నైట్‌ టెస్టులతో పాటు మైదానానికి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డాడు. ఏదో పింక్‌ బాల్‌ టెస్టుతో జనం ఎగబడతారనుకుంటే పొరపాటు పడినట్టేనన్న రాహుల్.. వాళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, మంచి సీట్లు, కార్లకు పార్కింగ్‌ లాంటి అవసరాల్ని తీర్చాలన్నారు.

మరోవైపు కచ్చితమైన టెస్ట్ క్యాలెండర్‌ను కూడా అమలు చేయాలని సూచించారు రాహుల్ ద్రవిడ్.. వాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో.. బాక్సింగ్‌ డే టెస్టు, లార్డ్స్‌ టెస్టు, యాషెస్‌ సిరీస్‌ లాంటివి ఇప్పటికీ ఆదరణ కోల్పోకుండా విరాజిల్లుతున్నాయంటే.. వాటికి కచ్చితమైన టెస్ట్ క్యాలెండరే కారణమని.. వాటి తరహాలో భారత్‌లో కూడా కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను జతచేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు రాహుల్ ద్రవిడ్.