మోడీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్

మోడీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్

లోక్ సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ కి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాని ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తూ రాహుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు. 'అనూహ్యంగా ప్రధాని మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ముగియడానికి నాలుగైదు రోజుల ముందు మీడియా ముందుకొచ్చారు మోడీ ఏ గదిలో మాట్లాడుతున్నారో ఆ గది తలుపులు వేసినట్టు నాకు చెప్పారు. మా తరఫున కొన్ని ప్రశ్నలు అడగాల్సిందిగా ఇక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులను కోరారు. కానీ వాళ్లని అనుమతించినట్టు లేదు' అని వెటకారం చేశారు. 

ఆ తర్వాత తాను ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరించిందని చెప్పడానికి ఇష్టపడబోనని అన్నారు. 'ప్రధాని తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈసీ ఆయననేమీ అనకుండా పక్షపాతంతో వ్యవహరించింది. మోడీ ప్రచారానికి అనుకూలంగా ఉండేటా మొత్తం ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారని రాహుల్ ఆరోపించారు. ఎవరెన్ని చేసినా చివరికి సత్యమే గెలుస్తుందని' ఆయన చెప్పారు.