రాహుల్, బాబు భేటీలో కీలక అంశాలపై చర్చ..!

రాహుల్, బాబు భేటీలో కీలక అంశాలపై చర్చ..!

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీలో కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. శనివారం నాడు రాహుల్‌ను కలిసిన చంద్రబాబు... ఇవాళ ఉదయం మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు జరగగా... నిన్న లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో జరిగిన భేటీ అంశాలను రాహుల్‌కు వివరించినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ చివరి దశకు చేరడంతో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాక ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా సమాలోచనలు చేసిన నేతలు.. ఫలితాలకు ముందు ఎలా వ్యవహరించాలి, ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాల కంటే ముందే ఎన్డీయేతర కూటమి నేతలంతా ఒకసారి సమావేశమైతే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. మరోవైపు రాహుల్‌తో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు.