ఏడాదికి రూ.3.60 లక్షల సహాయం..

ఏడాదికి రూ.3.60 లక్షల సహాయం..

కనీస ఆదాయానికి దిగువనున్న 5 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి రూ. 3.60 లక్షల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సంగారెడ్డి  జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉదయం లేచింది మొదలు 15 మంది ధనవంతుల సహాయం కోసమే పనిచేస్తారని విమర్శించారు. మోడీ పేదలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. కాంగ్రెస్ పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ లు చేస్తోందని ప్రకటించిన రాహుల్.. రోజుకు చైనాలో 50 వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంటే.. దేశంలో 27 వేల ఉద్యోగాలు కోల్పోతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు ఏ ఆర్థిక వేత్తను అడిగినా పిచ్చితనం అంటారని.. మోడీ నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ.. అధికారంలో వస్తే జీడీపీలో 6శాతం నిధులు విద్యా రంగంపై ఖర్చు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పేదరికాన్ని అంతం చేయాలనుకుంటే మోడీ పేదలను అంతం చేయాలనుకుంటున్నారని సెటైర్లు వేసిన ఏఐసీసీ చీఫ్.. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీని సపోర్ట్ చేస్తాడు.. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దును సమర్థించారు. రాఫెల్ పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు.. వారిద్దరికి ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టే ప్రశ్నించడంలేదని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హరిత, శ్వేత, టెలికాం విప్లవం తీసుకొస్తామన్నారు. పంట పొలాల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుతో రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయన్నారు. మోడీ ధనిక, పేదల అంటూ రెండు రకాల భారతదేశాలను ఏర్పాటుచేయాలని చూస్తున్నారని విమర్శించిన రాహుల్.. రూ. 15 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో అన్నప్పుడే మోడీ అబద్దం చెబుతున్నాడని నాకు తెలుసు.. అది అసాధ్యమైన పని అన్నారు. ఎన్నికలకు ముందు డ్రామాలో భాగంగా కేసీఆర్, మోడీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు.