రాహుల్ కోర్టుకు రానక్కర్లేదు

రాహుల్ కోర్టుకు రానక్కర్లేదు

రఫెల్ ఫైటర్ జెట్ డీల్ పై సుప్రీంకోర్ట్ ఆదేశాలను తప్పుగా వక్రీకరించడంపై విచారం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. ఎన్నికల సీజన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాజకీయ దాడికి పదును పెడుతూ తన వాదననే కోర్టు కూడా బలపరించిందనడాన్ని తప్పుపడుతూ వచ్చే మంగళవారం ఆయనపై కోర్టు ధిక్కార నేరం ఎందుకు మోపరాదో వివరించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. అయితే రాహుల్ గాంధీకి రవ్వంత ఊరట కూడా ఇచ్చింది. కోర్టుకు వ్యక్తిగతంగా కావడం నుంచి రాహుల్ కి కోర్టు మినహాయింపు నిచ్చింది. ఏప్రిల్ 30న విచారణకు రానున్న రాహుల్ గాంధీ రఫెల్ వ్యాఖ్య కోర్టు ధిక్కార కేసులో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు రానక్కర్లేదని సుప్రీంకోర్ట్ తెలిపింది. తన సమాధానాన్ని దాఖలు చేస్తే చాలని సూచించింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ పై సుప్రీంకోర్ట్ మంగళవారం విచారణ జరిపింది. రాహుల్ గాంధీ నిన్న (సోమవారం) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో తాను ఎన్నికల ప్రచార ఆవేశంలో అన్న 'చౌకీదార్ చోర్ హై' వ్యాఖ్యపై విచారం వ్యక్తం చేశారు. కానీ సర్వోన్నత న్యాయస్థానం రాహుల్ గాంధీ జవాబుతో సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మరోసారి నోటీస్ జారీ చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 30న విచారణ జరుపుతుంది.

ఇవాళ విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ ఆదేశాలు చూడకుండా తాను విలేకరులతో అలా చెప్పానని రాహుల్ వివరణ ఇవ్వడాన్ని పిటిషనర్ మీనాక్షి లేఖి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్లో తాను చెప్పినట్టు లేదని రాహుల్ గాంధీ అంగీకరించారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలపై సమాధానంగా రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేయడాన్ని చూస్తే అది క్షమాపణగా భావించలేమని రోహత్గీ అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ కేసును ముగించాలని కోర్టును అభ్యర్థించారు. కోర్టు రాహుల్ కి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని, కేవలం వివరణ మాత్రమే కోరిందని అన్నారు. సింఘ్వీ వాదనపై స్పందిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 'మేం నోటీసులు జారీ చేయడం మరచిపోయామని మీరు చెబుతున్నారు. ఇప్పుడే నోటీసులు జారీ చేసి ఆ తప్పు సరిదిద్దుకుంటామని' అన్నారు.