మనోహర్ పారికర్ తో భేటీ అయిన రాహుల్ గాంధీ

మనోహర్ పారికర్ తో భేటీ అయిన రాహుల్ గాంధీ

రాఫెల్ విమానాల కొనుగోళ్లపై మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ దగ్గర సంచలన ఫైళ్లు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆయనను కలుసుకున్నారు. గోవాలో వ్యక్తిగత పర్యటన జరుపుతున్న రాహుల్, విధానసభ పరిసరాల్లో పారికర్ తో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 63 ఏళ్ల పారికర్ పాంక్రియాస్ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. పారికర్ ని కలుసుకోవడంపై ‘ఈ ఉదయం నేను గోవా సీఎంతో భేటీ అయ్యాను. ఇది వ్యక్తిగత సమావేశమే. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ అని రాహుల్ ట్వీట్ చేశారు. 

నిన్ననే రాహుల్ గాంధీ రాఫెల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పేర్కొన్న టేపులు సరైనవేనని ప్రకటించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ దగ్గర ఈ వ్యవహారానికి సంబంధించిన ‘బాంబుల్లాంటి రహస్యాలు’ ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాహుల్ రాఫెల్ కి సంబంధించిన ఆడియో టేపులు, మనోహర్ పారికర్ పేరును ప్రస్తావించి సభలో కలకలం రేపారు. 

గోవా గవర్నర్ మృదులా సిన్హా  ప్రసంగం ముగిసిన వెంటనే సభ కార్యకలాపాలు నిలిచిపోగానే రాహుల్ గాంధీ మధ్యాహ్న సమయంలో విధానసభకు పరిసరాలకు చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్ అధ్యక్షుడు విధానసభ ఆవరణలోని ముఖ్యమంత్రి ఛాంబర్ కి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో 10 నిమిషాలు సమావేశమై వెళ్లిపోయారు. 

పారికర్‌తో రాహుల్ ఐదు నిమిషాలు భేటీ అయ్యారని, ఇరువురు ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదని గోవా సీఎల్పీ నేత చంద్రకాంత్ కవేల్కర్ స్పష్టం చేశారు. ఇది కేవలం రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన మాత్రమేనని, వచ్చే నెలలో రాహుల్ గోవాలో పర్యటిస్తారని తెలిపారు.