రాహుల్ ని కదిలించిన సునైన కథ

రాహుల్ ని కదిలించిన సునైన కథ

దేశంలో ఎన్నికల రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ గందరగోళంలో మనం మన దేశం, సమాజం ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? దేశానికి ఏం కావాలి? తెలుసుకోవాలంటే రంగులు మారే రాజకీయ ఎత్తుగడలు, ప్రకటనల గురించి ఏ మాత్రం తెలియని ఒక అమాయక స్వరం మాత్రమే నిజాయితీగా సరైన జవాబు ఇవ్వగలదు. కానీ ఆ గళాన్ని చేరుకొని, ఆ మాటలు వినే తీరిక చేసుకొనేందుకు ఎవరూ సమయం కేటాయించడం లేదు. దీనికి కావాల్సిన కాస్తంత ఓర్పు, సహనం పార్టీలు, నేతల దగ్గర కరువయ్యాయి. ఉత్తరప్రదేశ్ ఓలని అమ్రోలీలో ఎన్డీటీవీ అధినేత డాక్టర్ ప్రణయ్ రాయ్ ఎన్నికల పర్యటన హడావిడి మధ్య చిక్కిన కాస్తంత విరామంలో ఒక చిన్నపిల్లను కలుసుకొన్నారు. యుపిలోని మోహన్ లాల్ గంజ్ లో తన కుటుంబంతో నివసించే ఆ పాప పేరు సునైన రావత్. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక డాక్టర్ కావాలని.. తన గ్రామంలోని ప్రజలందరికీ సేవ చేయాలని కలలు కంటోంది. కానీ తన కలలు నెరవేర్చుకొనే క్రమంలో ఎలాంటి కష్టాలు అడ్డుగోడగా నిలిచాయో, వాస్తవ పరిస్థితులు తెలుసుకొనేంత జ్ఞానం సునైనకు లేవు. ఆమెతో ప్రణయ్ రాయ్ జరిపిన మాటామంతీలో ఒక్క ఆ పాపవి మాత్రమే కాదు.. గ్రామీణ భారతంలో తమ ప్రాంతాన్ని ఉపేక్షించారనే ఆక్రోశం, ఆయా ప్రాంతాల్లో మోసపోతున్న షెడ్యూల్డ్ తరగతుల ఆవేదన వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఈ బాలిక గొంతులో ఎక్కడా కుంగుబాటు తనం లేదు, తన స్వప్నాలు సాకారం చేసుకోవాలనే పట్టుదల ఉంది. 

సునైన రావత్ పై ప్రణయ్ రాయ్ ప్రత్యేక కథనం చూసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తన ట్విట్టర్ హ్యాండిల్ లో సునైన గురించి ప్రస్తావించారు. 'మోడీజీ మీ విధానాల కారణంగా సునైనకు ఏమైందో చూడండి. ఆమె ధైర్యానికి, సమదృష్టికి న్యాయ్ ఒక నివాళి. న్యాయ్ పేదరికపు సంకెలలను తెంచుతుంది. సునైన, ఆమె లాంటి లక్షలాది మంది జీవితాలను న్యాయ్ మారుస్తుంది' అని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.