ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వోద్యోగాల పరీక్షలకు దరఖాస్తు ఫీజు తొలగిస్తాం

ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వోద్యోగాల పరీక్షలకు దరఖాస్తు ఫీజు తొలగిస్తాం

లోక్ సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు రెండు రోజుల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నిరుద్యోగులను ఆకట్టుకొనే ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వోద్యోగాల పరీక్షలకు దరఖాస్తు ఫీజు తొలగిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ వాగ్దానాన్ని తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

అలాగే ప్రజారోగ్యం గురించి తమ పార్టీ విధానాన్ని ప్రకటిస్తూ దేశంలోని పౌరులందరికీ 'ఆరోగ్య హక్కు' పేరిట కొత్త చట్టం తెస్తామని చెప్పారు. 'స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఆరోగ్యానికి 3 శాతానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని' తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారానికి వస్తే మార్చి 31, 2019 వరకు ఉన్న అన్ని విద్యారుణాలపై వడ్డీని మినహాయిస్తామని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు.

లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 2న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తూ రాహుల్ గాంధీ ' యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త మార్గాలను అన్వేషించి ఉద్యోగాలను కల్పించేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తోందని' తెలిపారు. మార్చి 2020 కల్లా కేంద్ర ప్రభుత్వంలో, ఇతర సంస్థల్లో ఉన్న 4 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.