మోడీ ప్రచారానికి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి?

మోడీ ప్రచారానికి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి?

ప్రధాని మోడీ దేశప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని యువతకు, అందరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని అబద్ధాలు చెప్పారని రాహుల్ దుయ్యబట్టారు. రెండో దశలో ఏప్రిల్ 18న ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ కి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మోడీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు.

టీవీల్లో ప్రతి 30 సెకన్ల ప్రకటన ప్రసారానికి లక్షలాది రూపాయలు కావాల్సి ఉంటుందని, లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రచారానికి వస్తున్న డబ్బంతా ఎవరిది? ఎక్కడిదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 'ప్రతి చోటా నరేంద్ర మోడీ ప్రచారమే. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది. టీవీల్లో 30 సెకన్ల ప్రకటనకు, వార్తాపత్రికల్లో ప్రకటనలకు లక్షల్లో డబ్బు చెల్లించాలి. ఈ డబ్బు ఎవరిస్తున్నారు? అది మోడీ జేబులో నుంచి రావడం లేదని' కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శించారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రధానమంత్రి ఆ డబ్బును పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకు ఇచ్చారని ఆరోపించారు.

దేశంలోని రైతులను మోడీ నాశనం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. అబద్ధపు వాగ్దాలతో అధికారానికి వచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని తాను చెప్పనని రాహుల్ స్పష్టం చేశారు. తాను వాస్తవికతతో దేశంలోని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72,000 డిపాజిట్ చేస్తానని మాత్రమే చెబుతానని అన్నారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయకుండా దేశంలోని నిరుపేదలకు ఎలా సాయం చేయవచ్చో ఆర్థికవేత్తలను సంప్రదించి తెలుసుకున్న తర్వాతే 'న్యాయ్' పథకాన్ని ప్రకటించానని చెప్పారు. 'న్యాయ్ పథకం గురించి చెప్పినపుడు మోడీ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు. అది మధ్యతరగతి వారి జేబుల నుంచి మాత్రం కాదని చెబుతున్నాను. ఆదాయపన్నులో పెంపు ఉండబోదు. అది అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీల నుంచి వచ్చి మీ జేబుల్లోకి చేరుతుందని' రాహుల్ వివరించారు.