యూపీతో పాటు కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ?

యూపీతో పాటు కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి రెండు సీట్ల నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. శనివారం కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లాపల్లి రామచంద్రన్ రెండో సీటు గురించి సమాచారం ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని పార్టీ కంచుకోట వాయనాడ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు కేరళ పీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీతో పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువైన దక్షిణ భారతదేశంలోని ఏదైనా పార్లమెంట్ సీటుని గుర్తించాల్సిందిగా కర్ణాటక, తమిళనాడు, కేరళ నేతలని కొన్ని వారాలుగా కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడి చేస్తోంది. 

'దీనిపై చర్చలు దాదాపు నెల రోజులుగా సాగుతున్నాయి. ఆయనకు ఇష్టం లేదు. కానీ నచ్చజెప్పిన తర్వాత చివరికి ఒప్పుకున్నారని' కేపీసీసీ అధ్యక్షుడు తెలిపారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో వాయనాడ్ లోక్ సభ సీట్ ఏర్పడింది. ఇది కన్నూర్, మళప్పురమ్, వాయనాడ్ ఎంపీ స్థానాలను కలుపుకొని ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత ఎంఎల్ షానవాజ్ గత రెండు పర్యాయాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్నారు.

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కేరళలో ఒక సీటు నుంచి పోటీ చేయాల్సిందిగా కోరినట్టు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీ తెలిపారు. ఆయనకు వాయనాడ్ సీటు ఆఫర్ చేశారని, ఏ క్షణమైనా రాహుల్ గాంధీ జవాబు రావచ్చని చెప్పారు.

ఈ సీటుకి పార్టీ అభ్యర్థిగా మాజీ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు టి సిద్దికీ పేరు ముందుంది. కానీ ఆయన తాను రేసులో లేనని ప్రకటించారు. కోజికోడ్ లో ఎన్నికల నుంచి తప్పుకొంటున్నట్టు సిద్దికీ ప్రకటించారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు.