కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన టామ్ వడక్కన్ గురించి రాహుల్..

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన టామ్ వడక్కన్ గురించి రాహుల్..

ఒక రోజు ముందు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన టామ్ వడక్కన్ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ గఢ్ లో వడక్కన్ పార్టీ ఫిరాయింపు గురించి ప్రశ్నించగా టామ్ వడక్కన్ బీజేపీలో చేరినంత మాత్రానా పార్టీకి పెద్ద దెబ్బేం తగల్లేదని రాహుల్ అన్నారు. 'వడక్కన్ పెద్ద నేత ఏం కాదని' చెప్పారు. 

నిన్న టామ్ వడక్కన్ బీజేపీ కండువా కప్పుకొన్నారు. చేరేటపుడు ఆయన తన ముందు వేరే ప్రత్యామ్నాయం లేకపోయిందని చెప్పారు. పార్టీలో పవర్ సెంటర్ ఎవరో తెలియడం లేదన్నారు. పుల్వామా దాడి తర్వాత సైన్యంపై కాంగ్రెస్ వైఖరి నిరాశ కలిగించిందని, బరువెక్కిన గుండెతో పార్టీ వదలాలని నిర్ణయించుకున్నట్టు వడక్కన్ తెలిపారు. దేశభక్తిపై రాజీ పడరాదని టామ్ అన్నారు. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ లో యూజ్ అండ్ థ్రో సంస్కృతి ప్రబలిందని, అది తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తన జీవితంలో 20 ఏళ్లను కాంగ్రెస్ కిస్తే, పార్టీలో మాత్రం వంశపాలన పెరిగిపోయిందని విమర్శించారు.

టామ్ వడక్కన్ ను సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులలో ఒకరిగా చెబుతారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో వంశపారంపర్య విధానాలతో ఇబ్బందులు పడలేక పార్టీ వదలాలని నిర్ణయించుకున్నట్టు టామ్ వడక్కన్ తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు ముందు టామ్ వడక్కన్ చేసిన ఓ పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ట్విట్టర్ హ్యాండిల్ వెరిఫైడ్ కాదు. కానీ దీనిని టామ్ వడక్కన్ దే అంటున్నారు. ఫిబ్రవరి 3 నాటి ఆ ట్వీట్ లో 'మీరోసారి బీజేపీలో చేరితే మీ అన్ని అపరాధాలు తొలగిపోతాయని' వడక్కన్ పేర్కొన్నారు. దీనిని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.