లోక్ సభలో ఆడియో టేపుల కలకలం

లోక్ సభలో ఆడియో టేపుల కలకలం

గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె, ఒక అగంతకునితో మాట్లాడుతున్న ఆడియో టేపుని వినిపించేందుకు కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను అనుమతి కోరింది. ఆ టేపులో పారికర్ బెడ్రూమ్ లో రాఫెల్ డీల్ ఫైల్స్ ఉన్నందువల్ల మోడీ ప్రభుత్వాన్ని బెదిరించి అనారోగ్యంతో ఉన్నప్పటికీ గోవా సీఎం కుర్చీలో కొనసాగుతున్నారని రాణె చెబుతున్నారు. పారికర్ టేపు అభూత కల్పన అని అరుణ్ జైట్లీ అన్నారు. దీనిని సభలో వినిపించే పద్ధతి ఇది కాదని చెప్పారు. రాహుల్ గాంధీ పదేపదే అబద్ధాలు చెబుతున్నారని జైట్లీ ఆరోపించారు. టేపు సాధికారతపై రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటానని చెబితే ఆ నకిలీ టేపుని ఆయన వినిపించవచ్చని సూచించారు. దీంతో రాహుల్ తన డిమాండ్ పై వెనక్కి తగ్గి టేపులోని సంభాషణను చదివి వినిపిస్తానని రాహుల్ గాంధీ అభ్యర్థించగా స్పీకర్ అందుకు తిరస్కరించారు. రాహుల్ చదివేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆయన మైకుని కట్ చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ లేచి నిలబడి తమ అభ్యంతరం తెలియజేశారు. 

రాహుల్ గాంధీ మరోసారి జెపిసి ఏర్పాటుకి డిమాండ్ చేశారు. మోడీ స్వయంగా దేశప్రజల డబ్బుని డబుల్ ఏ జేబుల్లో పెట్టారని జెపిసి దర్యాప్తులో తేలుతుందన్నారు. రాఫెల్ పై రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నేత దేశాన్ని ఎంతో నిరుత్సాహ పరిచారని విమర్శించారు. మొన్నటి వరకు తనకు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి మధ్య సంభాషణ అంటూ అసత్యాలు ప్రచారం చేశారని.. ఇవాళ మరో టేపుతో వచ్చారని జైట్లీ రాహుల్ గాంధీపై విమర్శల దాడి చేశారు. కొందరికి సత్యం అంటే సహజమైన అయిష్టత ఉంటుందని.. అందుకే రాహుల్ సుప్రీంకోర్టు తీర్పుని కూడా తప్పుబడుతున్నారని చురక వేశారు. అసలు యుద్ధ విమానం అంటే ఏంటో ప్రాథమిక అవగాహన లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తుండటం శోచనీయమని అన్నారు.