కాంగ్రెస్ బస్సు యాత్రకు రాహుల్

కాంగ్రెస్ బస్సు యాత్రకు రాహుల్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గోనున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన ఆగస్టు 13, 14 తేదీలలో రెండ్రోజులు పాటు తెలంగాణలో పర్యటించనున్నారని ఢిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై రాహుల్ గాంధీతో ఢిల్లీలో సుదీర్ఘ మంతనాలు జరిపారు ఉత్తమ్. ఈ కీలక సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ కుంతియా, ఏఐసిసి ఇంచార్జ్ సెక్రటరీలు శ్రీనివాస కృష్ణన్, బోసురాజు పాల్గొన్నారు. త్వరలో పొత్తులు, అన్ని సామాజిక వర్గాలకు పార్టీలో సమ ప్రాధాన్యత లాంటి అంశాలపై టీపీసీసీ రూపొందించిన “ఎన్నికల వ్యూహం” పై రాహుల్  సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. సంస్థాగత, ఎన్నికలు నిర్వహణ కమిటీలను రాహుల్ ఖరారు చేయనున్నారని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ, ఏపీల నుంచి ఇద్దరికి చోటు కల్పించనున్నారని తెలిపారు. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అర్హులైన అభ్యర్ధుల పేర్లను సిద్ధం చేయాలని రాహుల్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక “ఎన్నికల మేనిఫెస్టో” సిధ్దం చేయాలని రాహుల్ సూచించారని ఉత్తమ్ చెప్పారు. అభ్యర్ధుల ఎంపికలో ఎన్నడూ లేని రీతిలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కోరినట్లు పేర్కొన్నారు. అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల్, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవలని రాహుల్ సూచించినట్లు తెలిపారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీ చేపట్టిన “లీడర్ షిప్ డెవలప్ మెంట్ మిషన్” పై రాహుల్ సమీక్షించారని ఉత్తమ్ పేర్కొన్నారు.