ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

ఓవైపు ఎండలు మండిపోతున్నాయి.. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి.. పెద్ద గాలిదుమారం.. అక్కడక్కడ చిరు జల్లులు, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. మరుసటి రోజు మళ్లీ తీవ్రమైన ఎండలు, బలమైన వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. మనుషులతో పాటు మూగజీవాలు కూడా తల్లడిల్లుతున్నాయి. అయితే, ఈ ఎండల తీవ్రత, అకాల వర్షాలు కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. తెలంగాణతో పాటు ఉత్తర కోస్తాంధ్రలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని, దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుండి శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కావొచ్చు అంటున్నారు అధికారులు.