జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలి: రాజశేఖర్

జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలి: రాజశేఖర్

వైసీపీ అధినేత జగన్‌తో తమకు ఉన్న మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయని ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్‌ అన్నారు. తన సతీమణి జీవితతో కలిసి ఇవాళ ఆయన వైసీపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను అపరిపక్వతతో ప్రవర్తించానని అన్నారు. అప్పటి జగన్‌ వేరు.. ఇప్పటి జగన్‌ వేరు అని ఆన్న రాజశేఖర్‌.. ఆయనకు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. జగన్‌ సీఎం అయ్యేందకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 

'చంద్రబాబు మంచి ముఖ్యమంత్రి.. ఆయన హయాంలో హైటెక్ సిటీ అభివృద్ధి జరిగింది. హైటెక్ సిటీ ఒక్కటే కాదు.. వ్యవసాయం, ఆరోగ్యశ్రీ పేరుతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో వైఎస్ వచ్చారు. చంద్రబాబు సూపర్ అనే పేరుతో ఉన్నప్పుడు వైఎస్ సూపర్, డూపర్ అనే రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు' అని చెప్పారు. జగన్‌.. పులి బిడ్డ అని.. ఎన్ని ఇబ్బందులొచ్చినా జనం కోసమే జగన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. జనం కోసమే అన్నీ చేస్తున్నారని రాజశేఖర్‌ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు మూడుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు జగన్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. 

రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని జీవిత అన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దని, జగన్‌లాంటి కష్టపడేవాళ్లు ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు.