చెన్నైకి షాక్‌.. రాజస్థాన్‌ భోణీ

చెన్నైకి షాక్‌.. రాజస్థాన్‌ భోణీ

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ అభిమానులకు అసలైన మజా పంచింది. ఐపీఎల్‌-13లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రెచ్చిపోయింది. శాంసన్ మెరుపులు, స్మిత్ మాస్టర్ స్ట్రోక్.. వెరసి రాజస్థాన్‌ చెన్నైని మట్టి కరిపించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పుడూ లేని వింధంగా స్మిత్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓపెనర్ అవతారమెత్తాడు. మరో ఓపెనర్ జైస్వాల్ ప్రారంభంలోనే ఔటయ్యాడు. వన్ డౌన్‌లో శాంసన్ వచ్చీ రావడంతోనే చెన్నైకి చుక్కలు చూపించాడు. దొరికిన బంతిని గ్రౌండ్ దాటిస్తూ 32 బంతుల్లో 74 పరుగులు చేశాడు. సంజూకి స్టీవ్ స్మిత్ క్లాసిక్ ఇన్నింగ్స్ తోడవడంతో రాజస్థాన్ భారీ స్కోరు వైపుగా సాగింది.

అయితే, శాంసన్ ఔట్ కావడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. వరుసగా వికెట్లు కూడా పడిపోవడంతో స్మిత్‌పై భారం పెరిగింది. ఒత్తిడిని తట్టుకోలేక స్మిత్ కూడా పెవీలియన్ బాట పట్టాడు. తక్కువ స్కోరుకే పరిమితమవుతుందన్న తరుణంలో.. చివరి ఓవర్లో ఆర్చర్ ఎంగిడీపై శివతాండవం ఆడాడు. అసలు ఊహకే అందని విధంగా వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి సమయానికి రాజస్థాన్ 7 వికెట్లకు గానూ 216 పరుగులు చేసింది. భారీ స్కోరు చేధనే లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసి పోటీలో ఉన్నట్లే అనిపించింది. కానీ, మురళీ విజయ్ మళ్లీ నిరాశ పరుస్తూ 21 పరుగులకే అవుటయ్యాడు. వాట్సన్ కొద్ది సేపు నిలబడి చివరికి తెవాటియాకు దొరికిపోయాడు. వికెట్లు పడుతున్నా తగ్గని డూప్లెసిన్ సిక్సర్లతో ఆర్‌ఆర్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లోనే 72 పరుగులు చేసి పోరాడాడు. కానీ, మిగతా ఆటగాళ్లు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. చివర్లో ధోనీ వరుస సిక్సులు బాదినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది.