రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

 రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ ఆటగాళ్లు అజింక్యా రహానె(37, 21 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్), జోస్‌ బట్లర్‌(89, 43 బంతుల్లో 8ఫోర్లు, 7సిక్స్) చెలరేగి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలివికెట్‌కు 60 పరుగులు జోడించాక రహానె ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రహానే సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ దశలో బట్లర్ చెలరేగిపోయాడు. సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించాడు. అయితే రాహుల్ చాహర్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి బట్లర్ భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత శాంసన్(31) బుమ్రా వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా చివర్లో శ్రేయాస్‌ గోపాల్‌(13) ధాటిగా ఆడి రాజస్థాన్ రాయల్స్ కు రెండో విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ(47, 32 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్), క్వింటన్‌ డికాక్‌(81, 52 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు) మొదటి నుంచీ దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కి రోహిత్, డికాక్‌లు 96 పరుగులు జోడించారు. తర్వాత సూర్యకుమార్‌(16), కీరణ్‌పోలార్డ్‌ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. చివర్లో డికాక్‌, ఇషాన్‌ కిషన్‌(5) ఔటైనా హార్దిక్ పాండ్య(28, 11 బంతుల్లో 1ఫోరు, 3సిక్సులు) బౌండరీలతో చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కులకర్ణీ, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు.