'అన్నాత్తే' షూటింగ్ కోసం హైదరాబాద్ కు రజనీకాంత్

'అన్నాత్తే' షూటింగ్ కోసం హైదరాబాద్ కు రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. ఈ సినిమా షూటింగ్ కోసం రజినీకాంత్ ఈరోజు విమానంలో హైదరాబాద్ బయలుదేరాడు. 2020 డిసెంబరులో స్వల్ప అనారోగ్యానికి గురైన రజిని గత నెలలో చెన్నైలో 'అన్నాత్తే' షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహించిన 'అన్నాత్తే' ఈ ఏడాది నవంబర్ 4న విడుదల కానుంది. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ బయలుదేరిన రజినీకాంత్ చెన్నై ఎయిర్ పోర్టులో కన్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో రజినీకాంత్ తన కారు నుండి దిగగానే అతని అభిమానులు 'తలైవా' అని అరుస్తున్నారు. రజినీకాంత్ ఓ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ ప్రయాణం చేయనున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. 

కాగా ఏప్రిల్ 1న రజినీకాంత్ సినిమా రంగానికి చేసిన కృషికిగానూ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 3న ఢిల్లీలో జరగబోయే అవార్డుల ప్రదానోత్సవంలో రజినీకాంత్ ఈ అవార్డును అందుకుంటారు.