సారీనా...చెప్పే ప్రసక్తే లేదన్న సూపర్ స్టార్

సారీనా...చెప్పే ప్రసక్తే లేదన్న సూపర్ స్టార్


పెరియార్ రామస్వామిపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ద్రవిడ ఉద్యమ పితామహుడు, సంఘ సంస్కర్త పెరియార్‌ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పైగా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ స్పష్టం చేయటంతో విషయం మరింత హాట్ గా మారింది.  తాను చెప్పిన విషయాల్లో అబద్ధాలేవీ లేవని, అవన్నీ అప్పట్లో పత్రికల్లో వచ్చినవేనని చెప్పారు. ఆ పత్రికల కథనాలను చూపించడానికి తాను సిద్ధమని, క్షమాపణ మాత్రం చెప్పే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మధ్య తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ ప్రసంగించారు. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని అన్నారు. ఏ ఒక్క వార్తాపత్రిక ఆ వార్తను ప్రచురించలేదని కానీ తుగ్లక్ పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు చో రామస్వామి ఒక్కరే ఆ వార్తను రాసి దాన్ని ఖండించారని గుర్తు చేశారు. ఆ వార్త కరుణానిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని కుదిపివేసిందని, ఆ మేగజైన్ కాపీలను అధికారులు సీజ్ చేస్తే, చో రామస్వామి వాటిని పునర్ముద్రించారని చెప్పారు.

దీంతో రజనీకాంత్.. పెరియార్ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెరియార్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతోనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రజినీకాంత్ తన వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని డీవీకే డిమాండ్ చేసింది. డీవీకేతో పలు రాజకీయ పార్టీలు కూడా రజినీకాంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, తాను చదివిన వార్తాంశాల ఆధారంగానే ఈ వ్యాఖ్యలు చేశానని రజనీకాంత్ వివరణ ఇచ్చారు. తానేమీ కల్పించి చెప్పలేదనీ, ఇంతకు ముందు ప్రాచుర్యంలో ఉన్న విషయాలనే తాను ఉటంకించానని అన్నారు. మీడియాలో కూడా ఈ అంశంపై  పలు కథనాలు ప్రచురితం అయ్యాయి అన్నారు కాబట్టి తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు రజినీ కాంత్. కానీ, రజనీ వ్యాఖ్యలకు నిరసనగా తంథై పెరియార్ ద్రవిడార్ కజగం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మరోవైపు రజనీకాంత్ క్షమాపణ చెప్పకుంటే థియేటర్లలో ప్రదర్శిస్తున్న ఆయన సినిమా దర్బార్ను అడ్డుకుంటామని డీవీకే హెచ్చరించింది.