తెలకపల్లి రవి విశ్లేషణ: రాజ్యసభ సస్పెన్షన్లు, సంకేతాలు 

తెలకపల్లి రవి విశ్లేషణ: రాజ్యసభ సస్పెన్షన్లు, సంకేతాలు 

ఇటీవలి కాలంలో అంటే కాశ్మీర్‌ 370 తర్వాత మరే బిల్లుపైనా లేనంత రాజకీయ వేడికి  రైతు సంబంధిత  బిల్లులు కారణమైనాయి. ఇవన్నీ రైతు పేరుతో వున్నా వారి ప్రయోజనాకు భంగం కలిగించేవిగా వున్నాయని ప్రతిపక్షాతో పాటు పాలక ఎన్‌డిఎ కూటమి పురాతన భాగస్వామి అకాలీదళ్‌ కూడా ప్రకటించింది. మంత్రి వర్గం నుంచి నిష్ట్క్రమించింది.హర్యానా ప్రభుత్వంలో వారి ప్రధాన భాగస్వామ్య   పక్షమైన జెపిపి కూడా  కొంత అసంతృప్తి ప్రకటించింది. గతంలో పలుమార్లు మద్దతునిచ్చిన టిఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక తేనెపూసిన కత్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభివర్ణించారు. మొదటి నుంచి మద్దతునిస్తున్న బిజూ జనతాదళ్‌, అన్నాడిఎంకె కూడా ఆలోచనలో పడినట్టు కథనాలు వచ్చాయి. దాంతో భయపడిన బిజెపి ఓటింగుకు వెళ్లకుండా మూజువాణితో ఆమోదించినట్టు ప్రకటించేసింది. పాలక కూటమికి స్వంతంగామెజార్టి లేని రాజ్యసభలో తప్పక ఓటింగు జరిపి వుండాల్సింది. అయితే ఆ విధంగా చేయకపోవడానికి ఏకైక కారణం కీలకమైన భాగస్వాములు   మద్దతుదారులు కూడా వ్యతిరేకించడమే. దేశంలో రైతు ఉత్పత్తుల అమ్మకాన్ని ధరనూ వినియోగ దారుల  ప్రయోజనాలు  అమితంగా ప్రభావితం చేసే ఈ బిల్లును  సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు చేసిన సూచనను మొండిగా తోసిపుచ్చడంతో సహజంగానే వారి నిరసన తారస్థాయికి చేరింది. అందులో తృణమూల్‌ ఎంపి డినెక్‌ ఒబ్రాయ్‌  సభ నిబంధన పుస్తకాన్ని ఉపసభాపతి  హరివంశ్‌కు చూపించే ప్రయత్నం చేశారు. అది ఆయన మీద దాడిగా చెబుతున్నారు.ఇక సిపిఎం సభ్యుడు రాజేశ్‌, కరీం సిపిఐ వినయ్‌ విశ్వం, తదితరులు  బిల్లు ప్రతును చించి వేయడం   గతంలోనూ చాలాసార్లు అనేక మంది చేసిందే. నెగ్గే అవకాశం లేదు గనక  వెల్‌ చుట్టూ  మార్షల్స్‌ను నిబెట్టుకుని ఏదో విధంగా ఆమోదింపచేసుకున్న పాలక పక్షం ప్రతిపక్షాల క్రమశిక్షణకు భంగం కలిగించాయని ఆరోపించడం నిజంగా విడ్డూరమే,  సభలో లేకుండా పోయిన సభాపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దానిపై ఆగ్రహోదగ్రులవడం ఈ రోజు  ఎనిమిది మందిని  సస్పెండ్ ‌చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తీవ్ర విఘాతం. పెద్ద సభగా చెప్పే రాజ్యసభలో ఇలాటి బిల్లును కొంత వరకైనా చర్చించడం ఆనవాయితీ కాగా ఆదరాబాదరాగా ఆమోదించుకోవడం ప్రభుత్వ ఇరకాటానికి నిదర్శనం. ఈ వాస్తవాన్నీ వదిలేసి ప్రతిపక్ష సభ్యులే తప్పు చేసినట్టు వెంకయ్య కోపగించడం హాస్యాస్పదం. ఉపసభాపతిపై అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా ఆయన తోసిపుచ్చడం చూస్తే  పాలక పక్ష బలహీనత ఏమిటో స్పష్టమవుతుంది.


          వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో సభాపతి అయినప్పటినుంచి సభా నిర్వహణ హుందాతనం అంటూ చాలా సార్లు సూక్తులు చెబుతున్నారు గాని గతంలో ఆయన సభ్యుడుగా వున్నప్పుడు బిజెపి వ్యవహరించిన తీరు ఎవరూ మర్చిపోరు. లోక్‌సభలోనైతే 2009- 2014 మధ్య అంటే యుపిఎ 2 హయాంలో బిజెపి నిరంతరం రభస సృష్టించడంతో సభ ఉత్పాదకత 92 శాతం నుంచి 45 శాతానికి పడిపోయింది. చివరకు వారే దీనివల్ల  లాభం లేదని సమీక్షించుకుని ఆఖరి దశలో కొంత వరకూ పాల్గొన్నారు. అలాటి బిజెపి ఇప్పుడు ఇతరులకు మాత్రం నిరసన తెలిపే హక్కు లేదనడం ఎలా చెల్లుతుంది? వెంకయ్య హయాంలో జెడియు అద్యక్షుడు శరద్‌ యాదవ్‌ను ఫిరాయింపు చట్టం కింద అనర్హుడిగా ప్రకటించి ఇప్పటినుంచి ఎవరి విషయంలోనైనా ఇంతేనన్నారు, వాస్తవంగా బీహార్‌ ముఖ్యమంత్రినితిష్‌ కుమార్‌ బిజెపికి దూరమై మళ్లీ చేతులు కలపడం జెడియు విధానం కాదని శరద్‌ యాదవ్‌ విధానం కోసం నిబడ్డారు తప్ప పార్టీ ఫిరాయించలేదు. దాన్ని అంత తీవ్రంగా తీసుకున్న వెంకయ్య టిడిపి  రాజ్యసభా పక్షం బిజెపిలో విలీనం అనగానే ముందు వెనక చూడకుండా ఆమోదం తెలిపారు. ఆ పార్టీ కూడా పరోక్షంగా సహకరించింది. ఇవన్నీ ఏ నీతి సూత్రాలను తెలియజేస్తాయి?


        ఇప్పుడిక రాజకీయసమీకరణా విషయానికి వస్తే  తెలంగాణ నుంచి టిఆర్‌ఎస్‌ పూర్తిగా వ్యతిరేకించగా ఎపిలో  ఆగర్భ శత్రువులైన పాలక వైసీపీ ప్రతిపక్ష టిడిపి పూర్తిగా బలపర్చాయి. సహజంగా కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మహోత్సాహంగా బలపర్చడమే గాక కాంగ్రెస్‌ వారిపై ఏవో వ్యాఖ్యలు  చేసి దుమారం సృష్టించారు, వాటిని పరిశీలించి అవసరమైతే తొగిస్తానని సభాపతిచెప్పవసి వచ్చింది. గతంలోనూ ఇప్పుడు కూడా ఏపికి ప్రత్యేక హోదా విభజన హామీ అమలు విషయంలో కేంద్రం పెద్దగా స్పందించకపోయినా ఈ రెండు ప్రధాన పార్టీలకూ అభ్యంతరంలేకపోవడం ఆశ్చర్యకరం.సోము వీర్రాజు అద్యక్షుడైనాక మొదట టిడిపి అధినేత చంద్రబాబు పైనే దాడి ఎక్కుపెట్టారు. అంతర్వేది ఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై నా  వేడిపెంచుతున్నారు. రాజధాని మార్పు విషయంలో టిడిపి వాదనను తొసిపుచ్చిన బిజెపి పోలవరం నిధుల విడుదలలో ప్రస్తుత ప్రభుత్వానికి కూడా రిక్తహస్తం చూపింది.అయినాసరే జిఎస్‌టి లోటు నుంచి రైతు బిల్లు వరకూ ప్రతి విషయంలో జగన్‌ కేంద్రానికి మద్దతు నివ్వడం వూహించదగిందే. కేసు కారణంగానే మీరు లొంగిపోతున్నారని ఈ  రెండు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటాయి. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ పై సిబిఐ దర్యాప్తు జరపాలని  వైసీపీ కోరితే రాష్ట్రంలో పాలన కుప్పకూలింది గనక కేంద్రం జోక్యం చేసుకోవాని టిడిపి రాయబారాలు పంపుతుంటుంది.వీరిద్దరి మధ్యనా బిజెపి వ్యూహం హాయిగా సాగిపోతున్నది.  ఈ రెండింటిని తోసిపుచ్చి తను ముందుకు రావాని కూడా ఆ పార్టీ పాచికు వేస్తున్నది. టిఆర్‌ఎస్‌ వ్యతిరేకత తర్వాత తెలంగాణలో బిజెపి అద్యక్షుడు బండి సంజయ్‌ దాడి మరింత పెరిగింది.


         టిఆర్‌ఎస్‌ మాత్రమే గాక బిజెడి అన్నాడిఎంకె అకాలీదళ్‌తో సహా వ్యతిరేకించడం మరికొంత మంది వూగిసలాటలో వుండటం  బలాబలాల   సమీకరణలో మార్పును సూచిస్తున్నాయి.నరేంద్ర మోడీ రెండవ సారి వచ్చాక బిజెపి పరిస్తితి అంత  ఏకపక్షంగా  లేదనే అభిప్రాయాన్ని ఈ పరిణామాలు ధృవపరుస్తున్నాయి. రాజ్యసభలో దూకుడు చర్చ ఓటింగు దాటవేత అందుకు అద్దం పడుతున్నాయి,బహుశా బీహార్‌ ఎన్నిక ఫలితాల తర్వాత జాతీయ స్తాయిలో  బలాబలాల పొందిక మరింత స్పష్టం కావచ్చు.