ఆ పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తోంది.. వైసీపీ ఎంపీల ఫైర్ !

ఆ పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తోంది.. వైసీపీ ఎంపీల ఫైర్ !

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం పై ఒక తెలుగు పత్రిక అవాస్తవాలు రాస్తోందని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సదరు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తోందన్న ఆయన ప్రజలలో ఆ పత్రిక పలుచన కావడం ఖాయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అమిత్ షా తో సమావేశం చాలా పాజిటివ్ గా  జరిగిందని, పోలవరంకు నిధులు, ఏపీ విభజన చట్టంలోని అంశాలపైనే చర్చ జరిగిందని అన్నారు. న్యాయ వ్యవస్థ పై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు   ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించిన ఆయన ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదని అన్నారు. జడ్జీల ప్రవర్తన పై అనేక అనుమానాలు వస్తున్నాయని ఈ అనుమానాలు రాకుండా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైనే ఉందని అన్నారు.

మోపిదేవి వెంకటరమణ :

ఇక మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఆ పత్రిక వికృతంగా ప్రవర్తిస్తోందని, సీఎం మీటింగ్ పై అబద్ధాలు ప్రచారం చేస్తోందని అన్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆ పత్రికకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగే,  సీఎం ఢిల్లీ వచ్చారన్న ఆయన అమరావతి కుంభకోణం, జడ్జీల వ్యవహారం, ఫైబర్ నెట్వర్క్ తదితర అంశాలను అమిత్ షా వద్ద సీఎం జగన్ ప్రస్తావించారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను ఆయన వివరించారని, వీటన్నింటిపైనా అమిత్ షా సానుకూలంగా స్పందించారని అన్నారు. పోలవరం బకాయిల గురించి కేంద్ర జల శక్తి  మంత్రి వద్ద ప్రస్తావించారని అన్నారు.

అయోధ్య రామిరెడ్డి : 

మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారన్న ఆయన  కేంద్రం వద్ద పెండింగు లో ఉన్న పలు అంశాలను సాధించుకునే దిశగా ముందుకెళుతున్నారని అన్నారు.