20 ఎకరాల్లో చెర్రీ మెగా స్టూడియో
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సొంతంగా ఓ మెగా స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే సమాచారం. చరణ్ ఇప్పటికే పలురకాల వ్యాపారాలు నిర్వహిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పేరుతో భారీ చిత్రాల్ని నిర్మిస్తూ ఇండస్ట్రీ అగ్రనిర్మాతగా వెలిగిపోతున్నారు. ఆ క్రమంలోనే తమ కంపెనీకి ప్రత్యేకించి ఓ స్టూడియో అవసరం కనిపిస్తోందిట. ఇది చెర్రీని స్టూడియో నిర్మాణానికి పురికొల్పిందని తెలుస్తోంది. ప్రస్తుతం స్థల పరిశీలన సాగుతోంది. అయితే ఈ స్టూడియోని హైదరాబాద్‌లో నిర్మించాలా? వైజాగ్‌లో నిర్మించాలా? అన్న డైలెమా కొనసాగుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయుడిగా సైరా- నరసింహారెడ్డి హైదరాబాద్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లో 22 ఎకరాల్లో భారీగా సెట్ వేశారు. ప్రస్తుతం ఈ స్థలం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అలానే రాష్ట్ర విభజన తర్వాత సినీపరిశ్రమ హైదరాబాద్ నుంచి వైజాగ్ తరలి వెళ్లిపోతుందన్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి- మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి విశాఖ ఔట్స్కర్ట్స్లో భారీగా స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేశారన్న ప్రచారం సాగింది. ఆ క్రమంలోనే విశాఖ నగరానికి సమీపంలో మెగాస్టార్- రామ్‌చరణ్ స్టూడియో కడతారని ఓ ప్రచారం సాగింది. చెర్రీ మైండ్‌లో ఆలోచన ఉంది. దగ్గుబాటి ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్, నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియోస్, ఘట్టమనేని ఫ్యామిలీకి పద్మాలయ స్టూడియోస్ ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి ఏ స్టూడియో లేదు. అందువల్ల కచ్ఛితంగా ఈ ప్లాన్ వర్కవుటవుతుందని, ఇతర స్టూడియోలకు ధీటుగా చెర్రీ స్టూడియో నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ రామ్‌చరణ్ స్టూడియో నిర్మిస్తే, అది మరింత మందికి ఉపాధిని పెంచేదే. ఈ ఆలోచన సరైనదేనని అభిమానుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)