రాష్ట్రపతి నిలబడలేరట!

రాష్ట్రపతి నిలబడలేరట!

జాతీయ అవార్డుల ప్రధానోత్సవం.. దేశంలో ఉత్తమ నటీనటులను ఎంపిక చేసి వారికి పురస్కారాలందజేసే వేడుక. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా జరిగే ఈ కార్యక్రమంలో విజేతలకు రాష్ట్రపతి పురస్కారాలు అందజేస్తారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అట్టహాసంగా వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ.. ఈ ఏడాది పురస్కార గ్రహీతలందరికీ రాష్ట్రపతి అవార్డులు అందజేయరట. 140 మంది విజేతల్లో 11 మందికి మాత్రమే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులు అందజేస్తారని తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కేవలం గంట మత్రమే కేటాయించారని సమాచారం. గంట కంటే రాష్ట్రపతి ఎక్కువ సమయం నిలబడలేనందువల్లే అందరికీ ఆయన అందజేయలేకపోతున్నారని తెలిసింది. 11 మందికి మినహా మిగతావారికి పలువురు కేంద్ర మంత్రులు అవార్డులు బహూకరిస్తారన్న సమాచారంతో విజేతలు నిరాశ చెందారట. కార్యక్రమాన్ని బహిష్కరించాలని పలువురు భావిస్తున్నారని సమాచారం.