ఎన్డీఏకి ఎల్జేపీ అల్టిమేటం

ఎన్డీఏకి ఎల్జేపీ అల్టిమేటం

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార ఎన్డీఏలో ప్రెషర్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. తమ డిమాండ్లు ఒప్పుకోలేదని మొదట టీడీపీ, తర్వాత శివసేన దూరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వంతు వచ్చింది. ఎన్నాళ్లుగానో తన కోరికలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపిస్తున్న ఎల్జేపీ ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే నెలలో దళిత సంఘాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తో కలిసి అల్టిమేటమ్ ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల విషయంలో పాత నియమాలనే కొనసాగిచాలని ఎల్జేపీ కోరుతోంది. ఇటీవల ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను తక్షణమే అరెస్టు చేయరాదని, ముందుగా పోలీసు దర్యాప్తు జరగాలని, నిందితులకు బెయిలు మంజూరు చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దళితులకు ఆగ్రహం తెప్పించిన ఈ తీర్పుని ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఎల్జేపీ డిమాండ్ చేస్తోంది.

ఈ ధర్మాసనంలో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఏ కే గోయల్‌ పదవీ విరమణ అనంతరం ఆయనను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసిన జస్టిస్‌ గోయల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, ఆయన కుమారుడు చిరాగ్‌ డిమాండ్‌ చేశారు.  వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా తమ డిమాండ్‌ నెరవేర్చకపోతే తాము దళితుల నిరసనల్లో పాల్గొంటామన్నారు.

అయితే చిరాగ్ తాము టీడీపీ మాదిరిగా ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళబోమని చెప్పారు. ప్రభుత్వంలో కొనసాగుతూనే దళితుల హక్కుల కోసం పోరాడతామన్నారు. గత ఏప్రిల్ లో సుప్రీంకోర్ట్ తీర్పుపై భగ్గుమన్న దళిత ఆందోళనలు హింసాకాండకు దారి తీశాయని.. ఈ సారి అవి మరింత తీవ్రంగా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని చిరాగ్ హెచ్చరించారు.