చల్లబడిన సోమారపు...

చల్లబడిన సోమారపు...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆర్టీసీ చైర్మన్, టీఆర్ఎస్‌కు చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించడం పెద్ద చర్చగా మారింది. అయితే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జోక్యంతో ఆయన చల్లబడ్డారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు పలువురు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అస్త్ర సన్యాసం వద్దు... మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అని సోమారపు సత్యనారాయణను కోరారు... మీ అనుభవం, పరిజ్ఞానం పార్టీకి, ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు చాలా అవసరం అని సోమారపు సత్యనారాయణకు సూచించిన కేటీఆర్... రాజకీయాల్లో చిన్నచిన్న సమస్యలు, చిక్కులు సహజమని అంత మాత్రానా రాజకీయాల నుంచి తప్పుకోవడం సరికాదని సలహాఇచ్చారు. 

అయితే తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ సోమారపు సత్యనారాయణ. తాను పనిని నమ్ముకున్న వ్యక్తినని... పార్టీకి ద్రోహం తలపెట్టేవాడిని కాదన్నారు. రామగుండం వివాదంలో తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసిన సోమారపు... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్పగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మంత్రి కేటీఆర్ చెప్పినట్టుగా నడుచుకుంటానని ప్రకటించారు. దీంతో సోమారపు సత్యనారాయణ వివాదానికి తెరపడింది.