అసెంబ్లీలో బడ్జెట్‌ 'రామాయణం'

అసెంబ్లీలో బడ్జెట్‌ 'రామాయణం'

హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆంధ్ర ప్రజల కోసం 'ఆరోగ్యశ్రీ'ని తెచ్చారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగంలో భాగంగా రామాయణంలోని ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేశారు.  'ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని  లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చాడు. అలాగే.. ఏపీ ప్రజల కోసం దివంతగ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. ప్రతి ఒక్కరూ కార్పొరేట్‌ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం పొందాలనే ఉద్దేశంతోనే వైఎస్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు' అని అన్నారు. ఈ సందర్భంగా  ఆరోగ్యశ్రీని విస్తరిస్తున్నామని బుగ్గన వివరించారు. ఇకపై వార్షికాదాయం రూ.5లక్షలు లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. బెంగళూరు, చెన్నైలలోని ప్రముఖ ఆస్పత్రుల్లో కూడా ఈ వైద్య సేవలు పొందవచ్చని చెప్పిన బుగ్గన.. ఆయా ఆస్పత్రుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.