రాందేవ్ షెల్ బాబా

 

యోగా గురు రాందేవ్ బాబా కూడా షెల్‌ కంపెనీల ఊబిలో ఇరుక్కున్నారు. తొలుత యోగా, తరువాత ఆయుర్వేదిక్ ఉత్పత్తులతో సంచలనం రేపడమే గాక... బహుళజాతి కంపెనీలకు చమటలు పట్టించిన బాబా ... ఇపుడు షెల్‌ కంపెనీల ఏర్పాటులో బిజీగా ఉన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో బిజీగా ఉన్న బాబా కూడా షెల్‌ కంపెనీల వ్యూహాన్ని ఆశ్రయించక తప్పలేదు. షెల్ కంపెనీ లంటే నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునే యంత్రాలని కేంద్ర ప్రభుత్వ ప్రచారం చేస్తోంది. షెల్ కంపెనీలు అనగానే నల్లధన కుబేరులు గుర్తుకు వచ్చేలా ఆర్థిక శాఖ ప్రచారం చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో రాందేవ్ బాబా... షెల్ కంపెనీల బాగోతం గురించి ఓ మీడియా సంస్థ ప్రత్యేక కథనం రాసింది. అధికార పార్టీతో అత్యంత చనువుగా ఉండే బాబాపై కథనం రాయడానికి సాధారణ మీడియా సంస్థలు భయపడుతాయి. మరి బాబాపై ఈ కథనం రాసిందెవరనుకున్నారు... రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానికి చెందిన బిజినెస్ ఛానల్... సీఎన్ బీసీ టీవీ18 రాందేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యంపై భారీ స్థాయిలో పరిశోధనలు చేసిన ఓ ప్రత్యేక కథనం రాసింది. ఇపుడు ఆ కథనంలోకి వెళదాం....

ఢిల్లీతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికైనా పాండవ్ నగర్ అంటే.. బిజిబిజీగా ఉండే చిన్న పాటి పట్టణం గుర్తుకు వస్తుంది. చిన్న చిన్న షాపులు.. దుకాణాలు. ఎక్కడా పెద్దభవనాలు కన్పించవు. కాని అక్కడ ఓ భారీ వ్యాపార సామ్ర్యాజానికి మూలమైన కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు వెర్వ్ కార్పొరేషన్. బాబాకు ఈ చిత్రమైన, మెడర్న్ కంపెనీకి లింక్ ఏమిటనుకుంటున్నారా? రామ్ దేవ్ బాబా అనగానే గుర్తుకు వచ్చే పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు ఈ కంపెనీకి లింక్ ఉంది. అదేమిటంటే... పతంజలికి అనుబంధ సంస్థే  ఈ వెర్వ్ కార్పొరేషన్. పతంజలి అంటే మనకు భారీ స్థాయిలో హోర్డింగ్ లు, టీవీల్లో భారీ ప్రకటనలు.. పబ్లిసిటీ  గుర్తుకు వస్తుంది. చిత్రమేమిటంటే ఇక్కడ ఓ బోర్డు కూడా ఉండదు. పైగా వెర్వ్ తో పాటు కాస్త పేరు మార్చిన మరో ఏడు కంపెనీలకు ఇదే స్థావరం. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో పతంజలి రూ. 325 కోట్ల పెట్టుబడి పెట్టింది.

పుట్టగొడుగుల్లా కంపెనీలు
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు 21 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. మరో 26 భాగస్వామ్య సంస్థలూ ఉన్నాయి. వీటన్నింటి ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి కంపెనీ పేరులోనూ పతంజలి ఉంటుంది. కాని వీటికి ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు ఉండవు. ఈ కంపెనీ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటాయి. వాటిని డిపాజిట్ల రూపంలో లేదా ఇతర ఫైనాన్స్ సాధనాల్లో ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పైగా వీటి ఏర్పాటు ఎంత గజిబిగా ఉందంటే ... అసలు ఎవరు .. ఎవరు ఓనరో తెలుసుకోవడం కష్టం. పేర్లలో ఏదో చిన్న మార్పు తప్ప.. అన్నీ ఒకేలా ఉంటాయి. కంపెనీ వ్యవహారాల శాఖకు సమర్పించిన వందలాది పత్రాలను సీఎన్ బీసీ టీవీ 18 ప్రతినిధి పరిశీలించారు. ఎక్కడా అందులో పేర్కొన్న చోట కనీసం సైన్ బోర్డు కూడా లేదు.  వాస్తవానికి పతంజలి ఆయుర్వేద్ కు కేవలం నాలుగు అనుబంధ సంస్థలే ఉన్నాయి. అలాగే పెద్ద సంస్థలు పలు కంపెనీలు ఏర్పాటు చేయడం సహజమే. వ్యాపార నిర్వహణ కోసం వీటిని ఏర్పాటు చేస్తుంటారు. కాని ఎలాంటి వ్యాపారం లేని కంపెనీల్లోకి కోట్లాది రూపాయలు మళ్ళించడం, అలాంటి పనీ పాటా లేని కంపెనీల షేర్లను భారీ ప్రీమియంతో కొనుగోలు చేయడం అనుమానాస్పదంగా ఉందని సీఎన్ బీసీ టీవీ 18 పేర్కొంది. స్కాట్ ల్యాండ్ కు చెందిన దంపతులు కూడా పెట్టుబడి పెట్టారని.. వీటన్నింటికి సంబంధించి తాము వివరణ కోరుతూ మెయిల్ పంపగా, పతంజలి ఆయుర్వేద్ స్పందించలేదని ఆ ఛానల్‌ పేర్కొంది.

రియల్ ఎస్టేట్ కంపెనీ కాని...
2010లో వెర్వ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ అసలు పేరు వెర్వ్ బిల్డింగ్ సొల్యూషన్స్...  ప్రధాన వ్యాపారం రియల్ ఎస్టేట్. కానీ ఈ కంపెనీకి ఎలాంటి కార్యకలాపాలు లేవు. అయినా ఈ కంపెనీకి పతంజలి ఆయుర్వేదిక్ 2015లో రూ. 27 కోట్లు చెల్లించి 98.94 శాతం వాటాను తీసుకుంది. తరువాత 2016 ఏప్రిల్ లో మిగిలిన  వాటాను రూ. 29 లక్షలు చెల్లించి తీసుకుంది. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించని వెర్వ్ కంపెనీ షేర్లను ఒక్కో షేర్ కు రూ. 279 ప్రీమియం ఇచ్చి పతంజలి ఎందుకు కొనుగోలు చేసింది?

స్కాట్ ల్యాండ్‌ దంపతులు
పతంజలి కంపెనీలోకి భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు స్కాట్ ల్యాండ్ లోని ఓ దీవిని బహుమతిగా ఇచ్చిన పొద్దార్ దంపతుల లావాదేవీలను కూడా పరిశోధించింది సీఎన్ బీసీ టీవీ18. 2007లో సునితా పొద్దార్, శర్వన్ పొద్దాలపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. పతంజలి గ్రూప్ లోని పలు కంపెనీల్లోకి నిధుల ప్రవాహాన్ని వివరించింది. పొద్దార్ దంపతులు ఓక్ మినిస్టర్ హెల్త్ కేర్ లిమిటెడ్‌ పేరుతో బ్రిటన్ లో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. సునీతా పొద్దార్ ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. వేదిక్ బ్రాడ్ కాస్టింగ్ ఇన్ కార్పొరేటెడ్ కు సీఈఓ, పంతంజలి యోగ్ పీఠ్ (యూకే) ట్రస్ట్ లో ట్రస్టీగా ఉన్న సునీతా పతంజలి యూనివర్సిటీ  బోర్డ్ ఆఫ్‌ డైరెక్టర్స్ లో సభ్యురాలు. ఈ వివరాలన్నీ ఆమె తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఇచ్చారని సీఎన్ బీసీ టీవీ18 పేర్కొంది.

నేపాల్ ఎయిర్ లైన్స్ తో లింకు...
పతంజలి గ్రూప్ కంపెనీ కన్ ఖాల్ ఆయుర్వేద్ ప్రైవేట్ లిమిటెడ్ 2011-12లో గుణ ఎయిర్ లైన్స్ కు కోటి రూపాయలు రుణంగా ఇచ్చింది. మరో గ్రూప్ కంపెనీ రోహిణి ఇన్ ఫ్రా కాన్ కూడా రూ. 2 కోట్లు ఇచ్చింది. కాని భూమి కోసం అడ్వాన్స్ గా ఈ సొమ్ము ఇచ్చినట్లు కంపెనీ రికార్డుల్లో పేర్కొంది. విచిత్రమేమిటంటే అలాంటి కంపెనీ మన దేశంలోనే లేదు. గూగుల్‌ లో పరిశీలిస్తే... నేపాల్ లో గుణ ఎయిర్ లైన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  మరి అదే విమాన సంస్థకు పతంజలి గ్రూప్ సొమ్ము చెల్లించిందా?  ఈ వ్యవహారంపై అటు గుణ ఎయిర్ లైన్స్, ఇటు పతంజలి గ్రూప్ స్పందించలేదని సీఎన్ బీసీ టీవీ18 పేర్కొంది.