'అయోధ్య' కేసులో సుప్రీం సంచలన తీర్పు

'అయోధ్య' కేసులో సుప్రీం సంచలన తీర్పు

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో 'మధ్యవర్తిత్వా'నికే సుప్రీం కోర్టు మొగ్గు చూపింది. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చా..? లేదా..? అనే విషయంపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సమస్య శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామపంచ్, జస్టిస్ ఎఫ్.ఎమ్. ఖలీపుల్లాలతో ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. 4 వారాల్లోగా మొదటి నివేదిక ఇవ్వాలని.. 8 వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయస్థానం.. మీడియాకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచాలని సూచించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలని... చర్చలన్నీ సీసీ కెమెరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. 

మధ్యవర్తి నియామకంపై నిర్మోహి అఖారా మినహా మిగిలిన హిందూ సంస్థలు వ్యతిరేకిస్తుండగా, ముస్లిం సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తి నియామకం సరైనది కాదని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి.