'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా పాత్రలేంటి?

'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా పాత్రలేంటి?

సమంత కొత్త ప్రాజెక్ట్స్ అంగీకరించడం లేదని, గతంలో అంగీకరించిన తమిళ చిత్రాలనే పూర్తి చేస్తోందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. అయితే... వాటికి చెక్ చెబుతూ గుణశేఖర్ 'శాకుంతలం'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మరోసారి చెలరేగిన అలాంటి రూమర్స్ కు మరో సినిమాకు సైన్ చేసి సమంత ఫుల్ స్టాప్ పెట్టబోతోందని అంటున్నారు. మలయాళ 'దృశ్యం'ను రీమేక్ చేసిన వెంకటేశ్, తాజాగా ఆ సినిమా సీక్వెల్ రీమేక్ షూటింగ్ నూ మొదలు పెట్టేశాడు. వెంకీ, మీనా జంటగా నటిస్తున్న'దృశ్యం' సీక్వెల్ లో తొలి భాగం లోని నటీనటులే నటిస్తున్నారు. అయితే... ఇటీవల సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా కొత్తగా జత అయ్యే ఆర్టిస్టులకు సంబంధించిన సమాచారం కూడా ప్రచారంలోకి వచ్చింది, దగ్గుబాటి రానా, సమంత ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారని అంటున్నారు. అయితే... 'శాకుంతలం' పూర్తయ్యే వరకూ సమంత వేరే సినిమాలకు అంగీకారం తెలుపదనే వార్తలు కొన్ని వచ్చినా, 'దృశ్యం -2' షూటింగ్ శరవేగంగా జరుగుతున్నందున సమంత నటించవచ్చని అంటున్నారు. 'దృశ్యం -2' మొదటి భాగం కంటే ఊహించని ట్విస్టులతో సాగుతుంది. పోలీసు అధికారులు వేసే ఎత్తులకు దీటుగా కథానాయకుడు పై ఎత్తులు వేస్తుంటాడు. అయితే 'దృశ్యం' సీక్వెల్ లో రెండు మూడు ప్రధాన పాత్రలు కొత్తగా జత అయ్యాయి. అందులో హీరో పోలీస్ స్టేషన్ లో శవాన్ని పూడ్చడం చూసిన పాత్ర ఒకటి కాగా, హీరో పక్కింట్లో అద్దెకు ఉండే దంపతుల పాత్రలు మరి రెండు! కథానుగుణంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ భార్యభర్తల పాత్రలనే సమంత, రానా పోషించే ఆస్కారం ఉందంటున్నారు. అయితే... అన్నా చెల్లెళ్ల వరస అయ్యే వీరు సిల్వర్ స్క్రీన్ పై జంటగా నటిస్తారా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ రెండు పాత్రల మధ్య భార్యభర్తల అనుబంధం పెద్దగా ఉండదని, అందువల్ల వాటిని వీరు పోషించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏదేమైనా 'దృశ్యం -2'లో రానా, సమంత నటిస్తే మాత్రం... తొలి చిత్రంకంటే దీనికి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి సమంత కొత్త దర్శకుల కథలను వినడం లేదని, నటనకు స్వస్తి పలికే ఆలోచనలో ఉందని వస్తున్న వార్తలకు ఆమె ఎలా చెక్ చెబుతుందో చూడాలి.