రవిబాబు డైరెక్షన్లో అభిరామ్ దగ్గుబాటి అరంగేట్రమ్!

రవిబాబు డైరెక్షన్లో అభిరామ్ దగ్గుబాటి అరంగేట్రమ్!

మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యే రోజు ఇక ఎంతో దూరంలో లేదు! కొన్ని సంవత్సరాలుగా అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అభిరామ్‌ దగ్గుబాటితో తనదైన శైలిలో సినిమా తీసేందుకు నట, దర్శకుడు రవిబాబు ఓ కథను తయారు చేశాడట. సురేశ్ బాబు సైతం దానికి ఓకే చేశాడని తెలుస్తోంది. దర్శక నిర్మాత ఇవీవీ సత్యనారాయణ తనయుడు నరేశ్‌ ను 'అల్లరి' సినిమాతో పరిచయం చేసింది కూడా రవిబాబే కావడం విశేషం. పైగా సురేశ్‌ బాబు, రవిబాబుకు మధ్య కూడా చక్కని అనుబంధం ఉంది. రవిబాబు తెరకెక్కించిన పలు చిత్రాలకు సురేశ్ బాబు సమర్పకుడిగా ఉన్నారు. అంతేకాదు... రవిబాబు ప్రతి సినిమాకు ఆయన తనవంతు సలహాలూ సూచనలు ఇస్తుంటారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతున్న సినిమా అభిరామ్ కెరీర్ కు ఎంత గట్టి పునాది వేస్తుందో చూడాలి.