రానా ఆ 'స్లాట్'లో భలే సెట్ అయ్యాడు!

రానా ఆ 'స్లాట్'లో భలే సెట్ అయ్యాడు!

కొందరు హీరోలకు కొన్ని రకాల క్యారెక్టర్స్ భలే సెట్ అవుతాయి. కాలేజ్ స్టూడెంట్ పాత్రలకు ఓ హీరో, పోలీస్ పాత్రలకు మరో హీరో, విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు ఇంకో హీరో ఇలా! అయితే రానా గత కొంతకాలంగా... కాకతాళీయంగానే కావచ్చు... పిరియాడిక్ మూవీస్ ఎక్కువ చేస్తున్నాడు. 'బాహుబలి' లాంటి జానపద చిత్రాన్ని పక్కన పెడితే, చారిత్రక చిత్రం 'రుద్రమదేవి', అలానే ఇండో - పాక్ వార్ మీద వచ్చిన హిస్టారికల్ మూవీ 'ఘాజీ' చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు. ఇక ఎన్టీయార్ బయోపిక్ లో చంద్రబాబుగా కాసేపు కనిపించి మెప్పించాడు. ఇటీవలే రానా నటించిన 'అరణ్య' మూవీ విడుదలైంది. అతని మరో సినిమా 'విరాట పర్వం' ఈ నెల 30న రాబోతోంది. ఇది కూడా 1980లోని నక్సలిజం బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. ఇది కాకుండా ఇప్పుడు రానా ఓ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు వెంకీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడట. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించే ఈ సినిమా 1940కు చెందిన కథతో సాగుతుందట. అయితే... ఇందులో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన సీన్స్ ఉంటాయో లేదో తెలియదు. జూలై నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. రానా ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో '1945' అనే మూవీని చేశాడు. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. దీనిని తెలుగులో సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ కూడా ఇదే ఏడాది జనం ముందుకు రాబోతోంది. మొత్తం మీద రానా హిస్టారికల్ మూవీస్ 'స్లాట్'లో భలే సెట్ అయ్యాడు!!