ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు
దేశంలోని సీఎంల పనితీరుపై ఒక సర్వే చేపడితే దానిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. అత్యధికంగా 70 శాతానికి పైగా ప్రజలు కేసీఆర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ సర్వేలో తేలిందన్నారు. ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడు అనే దిశగా ప్రజల ఆదరణతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో పాటు 50 శాతం ఓట్లు సాధించి ప్రజల దీవెనలతో కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారని కేటీఆర్ గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్కు, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభం కలుగుతుందని.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ గడ్డకు లాభమన్నారు. దేశంలో 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే కేంద్రం ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీల పాలనలో దేశం ఎంతమేరకు అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అయితే, తమదొక బుడ్డ పార్టీ అన్నారు. తమ పార్టీకి 16 సీట్లు ఉంటే.. ఆ పార్టీకి 40కి పైగా ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి, అఖిలేశ్ దయతలిస్తే.. సోనియా, రాహుల్ గెలుస్తారని.. లేదంటే అవికూడా రావని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)